ఒక్కరోజులో రూ.47 లక్షల కోట్ల సంపద ఆవిరి
బిజినెస్ : టెక్నాలజీ రంగంలో అగ్రగామి సంస్థ గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కు స్టాక్ మార్కెట్‌లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. గురువారం ఆ సంస్థ షేర్లు గణనీయంగా పడిపోవడంతో ఒక్కరోజులోనే సుమారు 500 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరైంది. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ.47 లక్షల కోట్లకు పైమాటే. కృత్రిమ మేధ (ఎఐ) రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నప్పటికీ, వాటి ద్వారా ఆశించిన స్థాయిలో ఆదాయం, లాభాలు వస్తాయా అనే సందేహాలు మదుపరుల్లో నెలకొన్నాయి. దీంతో ఆల్ఫాబెట్ షేర్లు ఆరు నెలల కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
గూగుల్ సెర్చ్‌లో ఎఐ ఆధారిత సమ్మరీలను ప్రవేశపెట్టడం వల్ల సంప్రదాయ ప్రకటనల ఆదాయంపై ప్రభావం పడుతోందని కంపెనీ వెల్లడించడం ఆందోళనకు దారితీసింది. మరోవైపు చాట్‌జీపీటీ, క్లాడ్ వంటి ఎఐ చాట్‌బాట్‌ల వినియోగం వేగంగా పెరుగుతుండటంతో భవిష్యత్తులో గూగుల్ సెర్చ్‌కు ఆదరణ తగ్గే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కంపెనీ మార్కెట్ విలువ 3.97 ట్రిలియన్ డాలర్ల నుంచి 3.46 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది.
ఇటీవల ప్రకటించిన మూడో త్రైమాసిక ఫలితాలు కూడా ఇన్వెస్టర్లను పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఆల్ఫాబెట్ మొత్తం ఆదాయం 127.6 బిలియన్ డాలర్లుగా నమోదైనప్పటికీ, వాల్‌స్ట్రీట్ విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీనికి తోడు డేటా సెంటర్లు, ఏఐ చిప్స్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు వెచ్చిస్తుండటంతో సంస్థ వద్ద అందుబాటులో ఉండే నగదు (ఫ్రీ క్యాష్ ఫ్లో) తగ్గుతోంది.
భవిష్యత్తులో ఎఐ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను మరింత పెంచాల్సి ఉంటుందని కంపెనీ సంకేతాలివ్వడం కూడా మదుపరుల్లో ఆందోళన పెంచింది. వ్యయాలు అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ, తక్షణ ప్రయోజనాలు, లాభాలపై స్పష్టత లేకపోవడంతో ఇన్వెస్టర్లు షేర్ల విక్రయాలకు మొగ్గుచూపుతున్నారు. ఈ పరిణామాలన్నీ కలిసి ఆల్ఫాబెట్ షేర్ల భారీ పతనానికి కారణమయ్యాయి.








కామెంట్‌లు (0)