మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Layoff - బోయింగ్‌లో మరోసారి ఉద్యోగాల కోత

2 గంటల క్రితం

Boeing cuts jobs again
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 11:28 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 2,500 మందిపై ప్రభావం.. ఉత్పత్తి మందగమనంతో సంస్థ కీలక నిర్ణయం


బిజినెస్ : విమానాల తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ బోయింగ్‌ లో మరోసారి ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధమైంది. సంస్థ కమర్షియల్ ఎయిర్‌ప్లేన్స్ విభాగంలో సుమారు 5 శాతం ఉద్యోగాలను తగ్గించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దాదాపు 2,500 మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. విమానాల ఉత్పత్తిని ఆశించిన స్థాయిలో పెంచలేకపోవడం, తయారీ కేంద్రాలు, సరఫరా వ్యవస్థలో కొనసాగుతున్న సమస్యలే ఈ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది.


ఈ మేరకు కమర్షియల్ ఎయిర్‌ప్లేన్స్ విభాగం చీఫ్ స్టెఫానీ పోప్ ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో వివరించారు. ఉత్పత్తి ప్రణాళికల్లో మార్పులు చేయాల్సి రావడంతో ప్రస్తుతం ఉన్న సిబ్బంది సంఖ్య సంస్థ అవసరాలకు మించి ఉందని పేర్కొన్నారు. ఉద్యోగుల తగ్గింపులో సహజ ఉద్యోగ విరమణలతో పాటు నేరుగా తొలగింపులు కూడా ఉంటాయని, డిసెంబర్‌లో నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.


01


ఉత్పత్తి లక్ష్యాలకు చేరని బోయింగ్‌ ....

బోయింగ్‌ ఆర్థిక పునరుద్ధరణకు కీలకమైన 737 విమానాల ఉత్పత్తి ఆశించిన వేగంతో సాగడం లేదు. నెలకు 47 విమానాల తయారీ సామర్థ్యాన్ని 2026 వేసవి నాటికి సాధించాలని గతంలో లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఆ గడువును 2027 ప్రారంభానికి వాయిదా వేసింది. 2026లో 737 విమానాల ఉత్పత్తి, డెలివరీ లక్ష్యాలను చేరుకోలేమని సంస్థ సీఈవో కెల్లీ ఆర్ట్‌బర్గ్ ఇప్పటికే ప్రకటించారు.


ఇతర విమానాల తయారీలోనూ ఆటంకాలు ....

ఉత్పత్తి సమస్యలు కేవలం 737 విమానాలకే పరిమితం కాలేదు. 787 డ్రీమ్‌లైనర్‌ విమానాల తయారీని నెలకు 8 నుంచి 10కి పెంచడంలోనూ సంస్థ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 767, 777 విమానాల తయారీ కార్యక్రమాల్లోనూ అంతరాయాలు కొనసాగుతున్నాయి. దీంతో ఉత్పత్తి వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నాలు మరింత ఆలస్యమవుతున్నాయి. మరోవైపు 2029 నాటికి 10 బిలియన్ డాలర్ల ఫ్రీ క్యాష్ ఫ్లో సాధించాలని బోయింగ్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సంస్థ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంపై అనిశ్చితి కొనసాగుతోంది.


2024లో 17 వేల మంది తొలగింపు ....

బోయింగ్‌లో 2024లో సుమారు 17 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అప్పట్లో భారీ మెషినిస్టుల సమ్మె, 737 మ్యాక్స్ 9 విమానంలో డోర్ ప్యానెల్ ఊడిపోయిన ఘటన సంస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. ఆ పరిణామాల నుంచి పూర్తిగా కోలుకోకముందే ఇప్పుడు మరోసారి ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది.


విమానాల ఉత్పత్తిని పెంచి ఆదాయాన్ని మెరుగుపరుచుకోవాల్సిన సమయంలోనే బోయింగ్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఉత్పత్తి మందగమనం, సరఫరా వ్యవస్థలో సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్ల భారం చివరకు ఉద్యోగులపై పడుతోంది. సంస్థ పునరుద్ధరణ ప్రయత్నాల మధ్య కార్మికుల ఉపాధి భద్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్