గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionటాటా సన్స్‌ ఛైర్మన్‌‌గా మళ్లీ చంద్రశేఖరన్‌

1 గంట క్రితం

chandrashaker.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 09:37 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పునర్నియామకంపై టాటా ట్రస్ట్‌ వ్యతిరేకత

​ముంబయి : టాటా గ్రూప్‌లో అనుహ్య పరిణామం చోటు చేసుకుంది. టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ మరో ఐదేళ్ల పాటు కొనసాగించేలా టాటా సన్స్ బోర్డు గురువారం ఆమోదం తెలిపింది. వాస్తవానికి 2027 ఫిబ్రవరి 20తో చంద్రశేఖరన్ పదవీకాలం ముగియాల్సి ఉంది. మరోసారి తన పునర్నియామకాన్ని కోరుకోవడం లేంటూ ఆయన గతంలో బోర్డుకు స్పష్టం చేసినప్పటికీ.. తాజాగా మారిన పరిణామాల నేపథ్యంలో ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌బిఐ) నిబంధనల ప్రకారం టాటా సన్స్ అప్పర్‌లేయర్ ఎన్‌బిఎఫ్‌‌సి లైసెన్స్‌ను సరెండర్ చేసే దరఖాస్తును తిరస్కరించడంతో.. కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అనివార్యమైంది. ఈ సంక్లిష్ట సమయంలో నాయకత్వ మార్పు సంస్థపై ప్రభావం చూపుతుందని భావించిన బోర్డు సభ్యులు.. చంద్రశేఖరన్‌ను తమ నిర్ణయంపై పునరాలోచించాలని కోరారు. నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ సిఫారసు మేరకు బోర్డు ఆయనకు మరో ఐదేళ్ల పాటు బాధ్యతలు అప్పగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ నిర్ణయంతో పాటు కంపెనీని మార్కెట్లో లిస్ట్ చేసే ప్రక్రియకూ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిణామాల ప్రభావంతో స్టాక్ మార్కెట్లో టాటా గ్రూప్ షేర్లు దూసుకుపోయాయి. టాటా కెమికల్స్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టిసిఎస్, టాటా మోటార్స్ తదితర షేర్లు భారీగా లాభాలను నమోదు చేశాయి.

కాగా.. బోర్డు సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా.. చంద్రశేఖరన్ పునర్నియామకాన్ని, అలాగే కంపెనీ లిస్టింగ్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం ట్రస్ట్స్ నామినీ డైరెక్టర్ల మద్దతు లేనిదే ఈ నియామకం చెల్లదన్నారు. ఇది చట్టపరంగా శూన్యం అని పేర్కొన్నారు. మాజీ సిజెఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకున్నప్పటికీ బోర్డు దానిని పట్టించుకోలేదని టాటా ట్రస్ట్స్ ఆరోపించింది. నామినీ డైరెక్టర్లలో ఒకరైన వేణు శ్రీనివాసన్ లిస్టింగ్‌కు అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం. మెజారిటీ డైరెక్టర్లు చంద్రశేఖరన్ వైపు నిలవడంతో తీర్మానం ఆమోదం పొందినట్లు వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ నిర్ణయాలు పూర్తిస్థాయిలో అమలు కావాలంటే రాబోయే వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారుల ఆమోదం లభించాల్సి ఉంది. గ్రూప్ దిగ్గజ సంస్థలో తలెత్తిన ఈ నాయకత్వ వివాదం ప్రస్తుతం కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్