2027 ఫిబ్రవరితో పదవీకాలం ముగింపు
ముంబయి : టాటా గ్రూప్ మాతృ సంస్థ టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగిసిన తర్వాత చైర్మన్‌గా కొనసాగకూడదని.. మరోసారి పదవీకాలం కోసం పోటీ చేయకూడదని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని టాటా సన్స్ బోర్డుకు తెలియజేసిన ఆయన నాయకత్వ మార్పిడి సజావుగా జరిగేలా తదుపరి చైర్మన్‌ను త్వరగా ఎంపిక చేయాలని కోరారు. ఆగస్టు 18న జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశానికి (ఎజిఎం) ముందు ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
టాటా గ్రూప్‌లో దాదాపు 40 ఏళ్ల తన ప్రయాణం ఎంతో సంతృప్తినిచ్చిందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంగా టాటా సన్స్‌కు నాయకత్వం వహించడం తనకు గొప్ప గౌరవం, బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆయన నిర్ణయం వెలువడిన వెంటనే టాటా గ్రూప్‌కు చెందిన కొన్ని ప్రధాన కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. టిసిఎస్ 3.9 శాతం, టాటా స్టీల్ 1.83 శాతం, టాటా పవర్ 1.26 శాతం వరకు నష్టపోయాయి.
బోర్డు విభేదాలే కారణమా..!
చంద్రశేఖరన్ పదవీకాలాన్ని 2027 తర్వాత మరో ఐదేళ్లపాటు పొడిగించేందుకు సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్‌లు సిఫార్సు చేసినట్లు సమాచారం. టాటా సన్స్ నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ కూడా దీనికి ఆమోదం తెలిపి 2026 ఫిబ్రవరి 24న జరిగిన బోర్డు సమావేశంలో ప్రతిపాదనను ఉంచింది. అయితే బోర్డులోని ఓ కీలక సభ్యుడి వ్యతిరేకతతో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నిర్ణయం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే చంద్రశేఖరన్ మరోసారి పదవిలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా కుటుంబంలోని తదుపరి తరం సభ్యులకు గ్రూప్‌లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశంపైనా ఊహాగానాలు ఉన్నాయి. 1987లో టాటా గ్రూప్‌లో చేరిన చంద్రశేఖరన్.. 2009లో టిసిఎస్ సిఇఒగా బాధ్యతలు చేపట్టి, 2017లో టాటా సన్స్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు ఆయన వారసుడి ఎంపిక టాటా గ్రూప్ భవిష్యత్ నాయకత్వ దిశను నిర్ణయించే కీలక అంశంగా మారింది.








కామెంట్‌లు (0)