సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చిన్న మొత్తాన్ని జమ చేసి పెద్ద మొత్తానికి వల..!

1 గంట క్రితం

sbi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 09:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ‘జంప్డ్‌ డిపాజిట్‌ స్కామ్‌’పై ఎస్‌బిఐ హెచ్చరిక

​ప్రజాశక్తి - హైదరాబాద్‌ : బ్యాంకు ఖాతాలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి డబ్బులు జమ అయితే అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) హెచ్చరించింది. పొరపాటున డబ్బులు పంపించామంటూ తిరిగి చెల్లించాలని కోరే సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపింది. జంప్డ్‌ డిపాజిట్‌ స్కామ్‌ పేరుతో జరుగుతున్న ఈ మోసంలో తొలుత ఖాతాలో చిన్న మొత్తాన్ని జమ చేసి.. ఆ తర్వాత అంతకంటే ఎక్కువ మొత్తాన్ని యుపిఐ ద్వారా బదిలీ చేయించుకుంటున్నారని పేర్కొంది. జాతీయ సైబర్‌ భద్రత ప్రత్యేక ప్రచార కార్యక్రమం 6.0లో భాగంగా ఎస్‌బిఐ ఈ హెచ్చరిక జారీ చేసింది.​

ఈ మోసంలో భాగంగా సైబర్‌ నేరగాళ్లు ముందుగా బాధితుడి బ్యాంకు ఖాతాలో కొంత నగదు జమ చేస్తారు. అనంతరం ఫోన్‌ చేసి పొరపాటున డబ్బులు పంపించామని, అత్యవసరంగా తిరిగి చెల్లించాలని కోరుతారు. అనారోగ్యం, ఇతర అత్యవసర పరిస్థితులను సాకుగా చూపుతూ భావోద్వేగ ఒత్తిడికి గురిచేస్తారు. డబ్బులు తిరిగి పంపేందుకు బాధితుడు అంగీకరించిన తర్వాత యుపిఐ చెల్లింపు అభ్యర్థన పంపిస్తారు. అయితే ఖాతాలో జమ చేసిన మొత్తం కంటే ఎక్కువ మొత్తానికి ఆ అభ్యర్థన ఉండవచ్చు. దాన్ని సరిగా పరిశీలించకుండా యుపిఐ పిన్‌ నమోదు చేసి ఆమోదిస్తే భారీగా నగదు కోల్పోయే ప్రమాదముందని ఎస్‌బిఐ హెచ్చరించింది.

ఖాతాలో గుర్తుతెలియని నగదు జమైతే ముందుగా బ్యాంకు అధికారిక యాప్‌ లేదా స్టేట్‌మెంట్‌లో లావాదేవీ వివరాలను పరిశీలించాలని సూచించింది. డబ్బులు పంపినట్లు చెప్పే వ్యక్తి మాటలను నమ్మి వెంటనే తిరిగి చెల్లించవద్దని స్పష్టం చేసింది. అనుమానం ఉంటే బ్యాంకు అధికారిక కస్టమర్‌ కేర్‌ను సంప్రదించాలని తెలిపింది. ముఖ్యంగా నగదు స్వీకరించేందుకు యూపీఐ పిన్‌ అవసరం లేదని గుర్తుచేసింది. ప్రతి చెల్లింపు అభ్యర్థనలో నగదు మొత్తం, స్వీకర్త వివరాలను నిర్ధారించుకున్న తర్వాతే లావాదేవీని ఆమోదించాలని సూచించింది. అనుమానాస్పద కాల్స్‌ను బ్లాక్‌ చేయడంతో పాటు మోసం జరిగినట్లు గుర్తిస్తే వెంటనే బ్యాంకుకు, సైబర్‌ క్రైమ్‌ విభాగానికి ఫిర్యాదు చేయాలని ఎస్‌బీఐ కోరింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్