ఆర్‌బీఐ ప్రోత్సాహకాలు ఉన్నా ఆశించిన మేర నిధుల సమీకరణ లేదు
న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు భారత్ బ్యాంకుల్లోని విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్ (ఎఫ్‌సీఎన్‌ఆర్-బి) డిపాజిట్ల సమీకరణపై ప్రభావం చూపుతున్నాయి. విదేశీ మూలధనాన్ని ఆకర్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) పలు ప్రోత్సాహకాలు ప్రకటించినప్పటికీ, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆశించిన స్థాయిలో నిధులు సమకూరడం లేదు. డిపాజిట్లను పెంచేందుకు ఉద్దేశించిన లివరేజ్ పథకం అమలులో జాప్యం కూడా ఈ మందగమనానికి కారణమైందని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
పశ్చిమాసియా దేశాల్లో పనిచేస్తున్న ప్రవాస భారతీయులు అక్కడ నెలకొన్న భౌగోళిక-రాజకీయ అనిశ్చితి కారణంగా దీర్ఘకాలిక డిపాజిట్లపై నిర్ణయాలు వాయిదా వేస్తున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, దాడులు, ఉద్యోగ భద్రతపై నెలకొన్న సందిగ్ధత కారణంగా ఎఫ్‌సీఎన్‌ఆర్ (బి) వంటి దీర్ఘకాలిక డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకంజ వేస్తున్నారు.
లాక్-ఇన్ వ్యవధి ఉండే ఎఫ్‌సీఎన్‌ఆర్ (బి) డిపాజిట్ల కంటే, అవసరమైనప్పుడు ఉపసంహరించుకునే వీలున్న సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్లకే ఎన్‌ఆర్‌ఐలు మొగ్గు చూపుతున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.
నిధులను ఆకర్షించేందుకు బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచినప్పటికీ, విదేశీ శాఖల్లో తగిన మూలధనం లేకపోవడంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు వినియోగదారులకు లివరేజ్ సదుపాయాన్ని పూర్తిస్థాయిలో అందించలేకపోతున్నాయి. మరోవైపు విదేశాల్లో నిధుల సమీకరణ వ్యయం కూడా పెరగడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. కొన్ని బ్యాంకులు మాత్రమే డాలర్ బాండ్ల ద్వారా నిధులను సమీకరించగా, మరికొన్ని బ్యాంకులు తమ ప్రణాళికలను వాయిదా వేసి చర్చల దశలోనే కొనసాగుతున్నాయి.
అయితే నిధుల సమీకరణపై బ్యాంకర్లు ఆశావహంగా ఉన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర ఆర్థికమంత్రి, ఆర్‌బీఐ ఉన్నతాధికారులు బ్యాంకుల ప్రతినిధులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. సెప్టెంబరు 30తో ముగియనున్న గడువులోపు డిపాజిట్ల సమీకరణ గణనీయంగా పుంజుకుంటుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 2013లో అమలు చేసిన ఇదే తరహా పథకంలో కూడా చివరి నెలలోనే అత్యధిక నిధులు సమకూరిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.








కామెంట్‌లు (0)