- అంతర్జాతీయ రాకపోకలపై యుద్ధ ప్రభావం
న్యూఢిల్లీ : అమెరికా యుద్ధోన్మాదంతో పశ్చిమాసియాలో రగులుతోన్న ఉద్రిక్తతలు భారత విమానయాన రంగంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలతో గగనతల ఆంక్షలు, ప్రత్యామ్నాయ మార్గాల వినియోగం, పెరిగిన కార్యాచరణ వ్యయాల కారణంగా మార్చి-జూన్ 2026 మధ్య కాలంలో పశ్చిమ ఆసియా మార్గాల్లో భారతీయ విమానయాన సంస్థలు తమ సీట్ల సామర్థ్యాన్ని దాదాపు 44 శాతం మేర తగ్గించాయి. ఎయిర్‌లైన్స్ డాటా ఎజెన్సీ ఒఎజి తాజా విశ్లేషణ ప్రకారం.. గతేడాది ఇదే కాలంలో 39.3 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. ఈ ఏడాది అది 22 లక్షలకు పడిపోయింది. దీంతో సుమారు 17.3 లక్షల సీట్ల సామర్థ్యం తగ్గినట్లు వెల్లడయ్యింది. సంస్థల వారీగా చూస్తే ఎయిర్ ఇండియా గ్రూప్ అత్యధికంగా సేవలను తగ్గించింది. ఎయిర్ ఇండియా 53.2 శాతం, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 45 శాతం, ఇండిగో 38.6 శాతం, స్పైస్‌జెట్ 44.5 శాతం, ఆకాశ ఎయిర్ 75.5 శాతం మేర పశ్చిమాసియా మార్గాల్లో సామర్థ్యాన్ని కుదించాయి. అదే సమయంలో విదేశీ విమానయాన సంస్థలు మాత్రం తమ కార్యకలాపాలను దాదాపు యథాతథంగా కొనసాగించాయి. వాటి సీట్ల సామర్థ్యం కేవలం 0.26 శాతం మాత్రమే తగ్గి 39.9 లక్షలుగా నమోదయ్యింది. గల్ఫ్ దేశాలకు చెందిన ఎమిరేట్స్, ఎతిహాద్, ఎయిర్ అరేబియా వంటి సంస్థలు తమ విస్తృత అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను సమర్థంగా వినియోగించుకోవడంతో ఈ ప్రభావాన్ని పెద్దగా ఎదుర్కోలేదు. కువైట్ ఎయిర్‌వేస్, ఫ్లైనాస్, సలాం ఎయిర్ వంటి సంస్థలు భారత మార్కెట్లో తమ ఉనికిని మరింత బలోపేతం చేశాయి. భారతీయ విమానయాన సంస్థలకు విమానాల ప్రయాణ సమయం పెరగడం, ఇంధన వినియోగం అధికం కావడం, బీమా ప్రీమియంలు పెరగడం వంటి కారణాలతో నిర్వహణ వ్యయం భారీగా పెరిగింది. దీంతో లాభదాయకత తగ్గిన మార్గాల్లో సర్వీసులు కొనసాగించడానికి బదులుగా ప్రత్యామ్నాయ అంతర్జాతీయ గమ్యస్థానాలపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్, థాయ్‌లాండ్, ఇటలీ, చైనా వంటి మార్గాల్లో భారతీయ ఎయిర్‌లైన్స్ తమ సామర్థ్యాన్ని పెంచుకున్నాయి.








కామెంట్‌లు (0)