శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ద్రవ్యోల్బణమే అసలు సవాలు

1 గంట క్రితం

enomony
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 11:12 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఆర్‌‌బిఐ గవర్నర్‌ మల్హోత్రా వెల్లడి

త్వరలోనే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు

పైలట్ ప్రాజెక్ట్‌కు సన్నద్దం

భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ అనిశ్చితులను తట్టుకునేంత బలంగా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రుతుపవనాల ప్రభావం వంటి అంశాలు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌‌బిఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. దూరదర్శన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి 6.6 శాతం వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేశారు. బ్యాంకింగ్ రంగం ఆరోగ్యకరంగా ఉందని, మూలధన సమృద్ధి బలంగా ఉండటంతో పాటు రుణాల వృద్ధి అన్ని రంగాల్లో ఆశాజనకంగా కొనసాగుతోందన్నారు. జూన్ నాటికి బ్యాంకింగ్ క్రెడిట్ వృద్ధి 18 శాతానికి చేరిందని, వ్యవసాయం, పరిశ్రమలు, గృహ రుణాలు, ఎంఎస్‌ఎంఇ రంగాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని వెల్లడించారు.

​అయితే.. ఇటీవల పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, రుతుపవనాల అనిశ్చితి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని గవర్నర్ హెచ్చరించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచుతూ ఆర్థిక వృద్ధిని కొనసాగించడం ఆర్‌‌బిఐ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. డాలర్ బలపడుతున్నప్పటికీ రూపాయి ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే స్థిరంగా ఉందన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో వాణిజ్య ఒప్పందాలు ఎగుమతులకు మద్దతునిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ రంగంలో ఎఐ వినియోగాన్ని ప్రోత్సహిస్తూనే డేటా భద్రత, సైబర్ ముప్పులపై బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇక రూ.10, రూ.20 ప్లాస్టిక్‌ ‌నోట్లు..

భారతీయ కరెన్సీలో త్వరలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ప్లాస్టిక్ ఆధారిత (పాలిమర్‌) కరెన్సీ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సన్నాహాలు చేస్తోందని రిపోర్టులు వస్తున్నాయి. 2027 నాటికి వీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. తొలి దశలో రూ.10, రూ.20 విలువైన పాలిమర్ నోట్లను చలామణీలోకి తీసుకువచ్చి ప్రజల అభిప్రాయాలను సేకరించిన తర్వాత దశలవారీగా విస్తరించాలని ఆర్‌బిఐ యోచిస్తోంది. అయితే పాలిమర్ నోట్లు వచ్చినప్పటికీ ప్రస్తుతం ఉన్న పేపర్ కరెన్సీ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

​ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల పాలిమర్ కరెన్సీ ప్రతిపాదన పరిశీలనలో ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పాలిమర్ సబ్‌స్ట్రేట్ షీట్ల తయారీ, సరఫరా కోసం ఆర్‌బిఐ నోట్ల ముద్రణ విభాగం గ్లోబల్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఇఒఐ) జారీ చేయగా.. ఆగస్టు 18 వరకు బిడ్లు ఆహ్వానించింది. నకిలీ నోట్లను అరికట్టడం, కరెన్సీ మన్నికను పెంచడం, తడిని తట్టుకోవడం, చిరిగిపోకుండా ఉండటం వంటి ప్రయోజనాల వల్ల పాలిమర్ నోట్లకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్‌, న్యూజిలాండ్ వంటి దేశాలు ఈ తరహా కరెన్సీని విజయవంతంగా వినియోగిస్తున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్