శనివారం, 21 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘స్నేహా’ పౌల్ట్రీపై ఐటి దాడులు

4 గంటల క్రితం

‘స్నేహా’ పౌల్ట్రీపై ఐటి దాడులు
- తెలుగు రాష్ట్రాల్లో 16 చోట్ల తనిఖీలు 
ప్రజాశక్తి – బిజినెస్‌ బ్యూరో image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 09:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- తెలుగు రాష్ట్రాల్లో 16 చోట్ల తనిఖీలు

ప్రజాశక్తి - బిజినెస్‌ ‌బ్యూరో : పౌల్ట్రీ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హైదరాబాద్‌కు చెందిన స్నేహా గ్రూప్‌ సంస్థలకు సంబంధించిన 16 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను (ఐటి) శాఖ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని సంస్థ కార్యాలయాలు, యూనిట్లతో పాటు గ్రూప్‌ డైరెక్టర్ల నివాసాల్లోనూ తనిఖీలు చేపట్టినట్లు వెల్లడయ్యింది. హైదరాబాద్‌, విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. భారీగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న సమాచారంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు, కీలక ఆర్థిక లావాదేవీల పత్రాలను పరిశీలిస్తున్నారు. స్నేహా గ్రూప్‌ ప్రధాన సంస్థ స్నేహా ఫార్మ్స్‌ హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ప్రధాన కార్యాలయంగా పని చేస్తోంది. రామ్‌ రెడ్డి దెండి, వరుణ్‌ రెడ్డి దెండి, స్నేహా దెండి సంస్థకు సంబంధించిన డైరెక్టర్లుగా ఉన్నారు. 1982లో రామ్‌ రెడ్డి చికెన్‌ మార్కెట్‌గా కార్యకలాపాలు ప్రారంభించిన ఈ గ్రూప్‌ 1994లో స్నేహా ఫార్మ్స్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి కోళ్ల పెంపకం, కోళ్ల ప్రాసెసింగ్‌, పశువుల దాణా తయారీ, వంట నూనెలు, సోయా ఉత్పత్తుల రంగాలకు విస్తరించింది. ​గ్రూప్‌ పరిధిలో బ్రీడర్‌ ఫారాలు, హేచరీలు, బ్రాయిలర్‌ ఫారాలు, లేయర్‌ ఫారాలు ఉన్నాయి. రెండు వేల మందికి పైగా కాంట్రాక్ట్‌ రైతులతో కలిసి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తెలంగాణలో ఆటోమేటెడ్‌ చికెన్‌ ప్రాసెసింగ్‌ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఈ సంస్థ గంటకు 12 వేల కోళ్లను ప్రాసెస్‌ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2012 నుంచి భారత రక్షణ సంస్థలకు ఫ్రోజెన్‌ చికెన్‌ సరఫరా చేస్తోంది.

​కోళ్ల ఉత్పత్తులతో పాటు పౌల్ట్రీ, చేపల దాణా తయారీ కోసం ప్రత్యేక ఫీడ్‌ మిల్లులను కూడా నిర్వహిస్తోంది. వంట నూనెల తయారీలో సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షన్‌, రిఫైనింగ్‌ కార్యకలాపాలు చేపడుతోంది. సఫాలా బ్రాండ్‌ పేరుతో సోయా ఉత్పత్తులను మార్కెట్‌ చేస్తోంది. స్నేహా గోల్డ్‌ ప్రోటీన్స్‌ కూడా గ్రూప్‌లో భాగంగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో సింగ్‌ పౌల్ట్రీ సంస్థను కొనుగోలు చేయడం ద్వారా బ్రీడర్‌ కోళ్ల సామర్థ్యాన్ని పెంచుకుంది. జపాన్‌కు చెందిన మిత్సుయి అండ్‌ కో సంస్థ కూడా గ్రూప్‌ బ్రాయిలర్‌ వ్యాపారంలో వ్యూహాత్మక పెట్టుబడిపై ఆసక్తి చూపింది. ఇటీవల ఫౌల్ర్టీ కంపెనీలు భారీగా ఆదాయాలు ఆర్జిస్తున్పప్పటికీ పన్నులను ఎగవేస్తున్నాయనేది ప్రధాన అరోపణ. కోళ్ల దాణ సరఫరాలో పలు సంస్థలు సిండికేట్‌‌గా మారి చిన్న రైతులను ఆర్థికంగా పీల్చిపిప్పి చేస్తోన్నాయి. ఈ కోణంలో కూడా ఐటి అధికారులు దృష్టి సారించి ఉంటారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. స్నేహ గ్రూప్‌‌లో తనిఖీలు శనివారం రాత్రి వరకు కొనసాగాయని సమాచారం. ఈ సోదాల్లో నగదు, పత్రాల స్వాధీనంపై స్పష్టత రావాల్సి ఉంది.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్