- ఎనిమిదేళ్లలో తొలిసారి సెన్సెక్స్ పతనం
- మిడ్, స్మాల్‌క్యాప్ షేర్లలో జోరు
ముంబయి : దీపావళి పండుగ రోజు ప్రత్యేకంగా నిర్వహించే ముహూరత్ ట్రేడింగ్‌లో భారత స్టాక్ మార్కెట్లు నష్టాలను చవి చూశాయి. కొత్త సంవత్ 2083కు స్వాగతం పలుకుతూ ఆదివారం జరిగిన ప్రత్యేక ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ పతనమయ్యాయి. 2017 తర్వాత తొలిసారిగా దీపావళి ముహూరత్ సెషన్‌లో ఈ రెండు సూచీలు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 28.62 పాయింట్లు లేదా 0.04 శాతం తగ్గి 80,999కు పరిమితమయ్యింది. నిఫ్టీ 43.95 పాయింట్లు లేదా 0.18 శాతం కోల్పోయి 24,986 వద్ద ముగిసింది. శుభారంభం కోసం మదుపర్లు ఆశించిన ప్రత్యేక సెషన్‌లోనే మార్కెట్లు నష్టాల బాట పట్టడం ఈసారి నిరాశకు గురి చేసింది. గడిచిన ఎనిమిదేళ్లలో దీపావళి రోజు నష్టాలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. చివరిసారిగా 2017 అక్టోబర్‌లో ముహూరత్ ట్రేడింగ్ సందర్భంగా ఈ రెండు సూచీలు 0.6 శాతం చొప్పన నష్టపోయాయి. ముహూరత్ ట్రేడింగ్ సంప్రదాయబద్ధమైన ప్రత్యేక గంటపాటు జరిగే లావాదేవీల సెషన్. ఈ శుభ సమయంలో షేర్లు కొనుగోలు చేయడం రాబోయే ఏడాదికి మంచి సూచికగా మదుపర్లు భావిస్తారు.
మరోవైపు బిఎస్‌ఇ 150 మిడ్‌క్యాప్ సూచీ 0.4 శాతం, బిఎస్‌ఈ 250 స్మాల్‌క్యాప్ సూచీ 1.33 శాతం పెరిగాయి. బిఎస్‌ఇలో 3,253 షేర్లు లాభపడగా, 947 షేర్లు నష్టపోయాయి. మరో 254 షేర్లు యథాతథంగా నమోదయ్యాయి. ఇటీవలి రోజుల్లో విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్లలో మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించారు. నవంబర్‌లో ఇప్పటివరకు నికరంగా 3.6 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు వారి మొత్తం నికర అమ్మకాల విలువ 26.8 బిలియన్ డాలర్లకు తగ్గింది. గత వారం నిఫ్టీ 50 ఏకంగా 8 శాతానికి పైగా లాభపడింది. 2021 ఫిబ్రవరి తర్వాత ఒక వారంలో నమోదైన అతిపెద్ద పెరుగుదల ఇదే. అమెరికా, దక్షిణ కొరియా మార్కెట్లలో ఎఐ సంబంధిత షేర్లలో దిద్దుబాటు చోటుచేసుకోవడం కూడా భారత ఈక్విటీలపై మదుపర్ల ఆసక్తిని పెంచింది.
2011 తర్వాత అత్యధిక నష్టం..
రంగాలవారీగా నిఫ్టీ ఫార్మా 1.7 శాతం, మెటల్, సిమెంట్ సూచీలు 0.4 శాతం చొప్పున లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీ రియల్టీ 0.7 శాతం, నిఫ్టీ బ్యాంక్, ఐటి సూచీలు చెరో 0.4 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ సూచీ 0.3 శాతం చొప్పున నష్టపోయాయి. గత సంవత్ 2082లో (ఏడాదిలో) స్థూలంగా సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా సుమారు 4 శాతం, 3 శాతం చొప్పున నష్టపోయాయి. 2011 తర్వాత ఈ సూచీలకు ఇదే అతిపెద్ద వార్షిక పతనంగా నిలిచింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడం, ముడిచమురు ధరలు నియంత్రణలో ఉండటంతో ప్రస్తుతం మార్కెట్లకు మద్దతు లభించవచ్చని ఎస్‌బిఐ క్యాప్స్ సెక్యూరిటీస్ ప్రతినిధి సన్నీ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. అయితే అంతర్జాతీయ రాజకీయ, విధానపరమైన పరిణామాలపై స్పష్టత వచ్చే వరకు మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగవచ్చని పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)