పనితీరు మందగింపు, మైలేజ్ తగ్గుదల
వాహనాన్ని మార్చి ఇవ్వాలి
లేదా రూ.21.6 లక్షలు చెల్లించాలి
వినియోగదారుల కమిషన్ కీలక తీర్పు
న్యూఢిల్లీ : మారుతి సుజుకి గ్రాండ్ విటారా కారును ఈ20 పెట్రోల్ దెబ్బతీసింది. ఈ ఇంధనంతో కారు మైలేజ్ తగ్గడంతో పాటుగా ఇతర సమస్యలు తలెత్తాయి. దీంతో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ దేశంలోనే తొలిసారిగా ఈ20 పెట్రోల్ వినియోగానికి సంబంధించిన కేసులో మారుతి సుజుకికి వ్యతిరేకంగా కీలక తీర్పును వెలువరించింది. రాయ్‌పూర్‌కు చెందిన డాక్టర్ ప్రేమ్‌రాజ్ దేవ్తా కొనుగోలు చేసిన మారుతి గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ వాహనంలో ఇంజిన్ మిస్‌ఫైరింగ్, పనితీరు మందగించడం, మైలేజ్ తగ్గడం వంటి సమస్యలు తలెత్తడంతో ఆయన కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ20 పెట్రోల్ వాడిన తర్వాతే ఈ సాంకేతిక లోపాలు కనిపించాయని, వాహనం కొనుగోలు సమయంలో అది ఇ20 ఇంధనానికి పూర్తిగా అనుకూలం కాదనే విషయాన్ని కంపెనీ లేదా డీలర్ తమకు వెల్లడించలేదని ఫిర్యాదులో స్పష్టం చేశారు.
విచారణ సందర్భంగా మారుతి సుజుకి, డీలర్ సంస్థ తమ వాహనం ఈ20 ఇంధనానికి పూర్తిగా అనుకూలమేనని, సమస్యలకు ఇంధన నాణ్యత లోపాలు లేదా వాహన నిర్వహణలో లోపాలే కారణమై ఉండవచ్చని వాదించాయి. అయితే ఈ వాదనలను కమిషన్ తోసిపుచ్చింది. ప్రస్తుతం దేశంలోని చాలా పెట్రోల్ బంకుల్లో ఈ20 పెట్రోల్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఆ ఇంధనంతో వాహనం సక్రమంగా పనిచేయాల్సిన బాధ్యత తయారీ సంస్థదేనని స్పష్టం చేసింది. ఒకవేళ వాహనం ఈ20 ఇంధనానికి పూర్తిగా అనుకూలం కాకపోతే ఆ విషయాన్ని కొనుగోలుదారుడికి ముందుగానే తెలియజేయాల్సిన బాధ్యత కంపెనీలపై ఉంటుందని కమిషన్ అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో 45 రోజుల్లోపు ఫిర్యాదుదారుడి వాహనాన్ని ఈ20కి పూర్తిగా అనుకూలమైన కొత్త వాహనంతో మార్చాలని మారుతి సుజుకి, డీలర్ సంస్థలకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే వాహనం ధర, ఆర్‌టిఒ, బీమా కలిపి రూ.20,50,494 తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అదనంగా మానసిక వేదనకు రూ.1 లక్ష, న్యాయ వ్యయాల కింద రూ.10,000 చెల్లించాలని పేర్కొంది. గడువులోగా ఈ ఆదేశాలను అమలు చేయకపోతే, చెల్లించాల్సిన మొత్తంపై ఏడాదికి 7 శాతం వడ్డీ వర్తిస్తుందని కమిషన్ స్పష్టం చేసింది. కాగా ఈ తీర్పును పైకోర్టులో సవాలు చేయనున్నట్లు మారుతి సుజుకి ప్రకటించింది.








కామెంట్‌లు (0)