- అదానీ గ్రూప్‌నకు ఇండిగో సిఇఒ విల్లీ వాల్ష్ సూచన
ముంబయి : ముంబయి విమానాశ్రయంలో టెర్మినల్-1 పునరాభివృద్ధి పనులతో ప్రయాణికుల సామర్థ్యం పెరగనున్న నేపథ్యంలో విమానయాన సంస్థలపై విధించే ఒక్కో ప్రయాణికుడి ఏరోనాటికల్ ఛార్జీలను తగ్గించాలని ఇండిగో సిఇఒ విల్లీ వాల్ష్ కోరారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ‘అవియేషన్ ఇండియా 2026’ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. విమానాల ల్యాండింగ్, పార్కింగ్ వంటి సేవలకు విమానాశ్రయాలు వసూలు చేసే ఈ రుసుములు విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో కీలకంగా ఉంటాయన్నారు. వాటి భారం చివరకు టికెట్ ధరలపైనా పడుతుందని ఆయన పేర్కొన్నారు. విమానాశ్రయాల సామర్థ్యం పెరిగినప్పుడు ఆ ప్రయోజనం ఛార్జీల తగ్గింపు రూపంలో విమానయాన సంస్థలకు, ప్రయాణికులకు అందాలని స్పష్టం చేశారు. ముంబయితో పాటు నవీ ముంబయి విమానాశ్రయం కూడా అదానీ గ్రూప్ సంస్థల ఆధీనంలో ఉన్నాయి. ఇండిగో అంతర్జాతీయ, దేశీయ విస్తరణ ప్రణాళికల్లో నవీ ముంబయి విమానాశ్రయం కీలక పాత్ర పోషించనుందని వాల్ష్ తెలిపారు. భారత్‌లో 300కు పైగా నగరాల మధ్య ఎలాంటి పోటీ లేకుండానే సర్వీసులు నిర్వహిస్తున్నామని వాల్ష్ తెలిపారు. కార్గో వ్యాపారం భవిష్యత్తులో సంస్థ ఆదాయంలో కీలక భాగంగా మారనుందని చెప్పారు.
మూడు పెద్ద విమాన సంస్థలు అవసరం : అదానీ ఎయిర్‌పోర్ట్ సిఇఒ
భారత విమానయాన రంగంలో అంతర్జాతీయ పోటీని తట్టుకోవాలంటే ఇండిగో, ఎయిర్ ఇండియాలకు తోడుగా మరో బలమైన దేశీయ విమానయాన సంస్థ అవసరమని అదానీ ఎయిర్‌పోర్ట్స్ సిఇఒ అరుణ్ బన్సల్ పేర్కొన్నారు. విదేశీ విమానయాన సంస్థలకు మరింత విస్తృతంగా అవకాశాలు కల్పించే ముందు దేశీయ సంస్థలను బలోపేతం చేయాలని సూచించారు. ప్రస్తుతం దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 30 కోట్లుగా ఉండగా, 2040–45 నాటికి 110–120 కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు. పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా విమానాశ్రయాల మౌలిక సదుపాయాలను విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)