- ఆగస్టు 18న ఏజీఎంకు ముందు నిర్ణయం
- ఫిబ్రవరి 2027 వరకు ప్రస్తుత పదవీకాలం
- టాటా ట్రస్ట్స్‌తో విభేదాల నేపథ్యంలో రాజీనామా!
ముంబై: టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన ప్రస్తుత పదవీకాలం ముగిసే వరకు, అంటే ఫిబ్రవరి 2027 వరకు బాధ్యతల్లో కొనసాగనున్నట్లు రాయిటర్స్ నివేదించింది. ఆగస్టు 18న జరగనున్న టాటా సన్స్ వార్షిక సర్వసభ్య సమావేశానికి (ఏజీఎం) ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది. చంద్రశేఖరన్ కొనసాగింపు ఆయన టాటా సన్స్ బోర్డులో డైరెక్టర్‌గా తిరిగి నియమితులవడంపై ఆధారపడి ఉంది. ఆగస్టు 18న జరిగే ఏజీఎంలో ఆయన పునర్నియామకం కీలక అంశంగా ఉంది. అయితే తాజా పరిణామాల ప్రకారం ఆయన మళ్లీ పదవిని కోరుకునే అవకాశం లేదని తెలుస్తోంది. టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు ఈ పరిణామానికి కారణంగా తెలుస్తోంది. బోర్డు ప్రాతినిధ్యం, గ్రూప్ పాలన, వ్యూహాత్మక నిర్ణయాలు, టాటా సన్స్ భవిష్యత్ నిర్మాణం వంటి అంశాలపై ఇరు వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా, చంద్రశేఖరన్ పునర్నియామకంపై కొన్ని షరతులు విధించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. టాటా సన్స్‌ను ఎప్పటికీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయకూడదనే హామీతో సహా, నోయెల్ టాటా అనేక షరతులను కోరారు. అయితే ఆ హామీ ఇవ్వడానికి చంద్రశేఖరన్ సుముఖంగా లేరని సమాచారం.
చంద్రశేఖరన్ రాజీనామా వార్తల నేపథ్యంలో టాటా గ్రూప్‌కు చెందిన పలు లిస్టెడ్ కంపెనీల షేర్లలో ఒత్తిడి కనిపించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సహా పలు టాటా గ్రూప్ కంపెనీల షేర్లు పడిపోయాయి. పెట్టుబడిదారుల్లో నాయకత్వ మార్పుపై ఆందోళనలు పెరగడం మార్కెట్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
చంద్రశేఖరన్ 2017లో టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. టాటా గ్రూప్‌లో ఆయన దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. టాటా సన్స్ ఇప్పటివరకు చంద్రశేఖరన్ రాజీనామాపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన పదవీకాలం పూర్తయ్యే వరకు కొనసాగడం, తదుపరి నాయకత్వంపై టాటా గ్రూప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.







కామెంట్‌లు (0)