- పాలసీ నిబంధనలకు విరుద్ధంగా కోతలు
- స్టార్ హెల్త్‌కు రూ.2 కోట్ల జరిమానా
- ఐఆర్‌డిఎఐ ఆగ్రహం
ప్రజాశక్తి – బిజినెస్ డెస్క్ : స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల పరిష్కారంలో నిబంధనలను ఉల్లఘించింది. సమర్థనలేని కారణాలతో క్లెయిమ్‌లను తిరస్కరించడం, పాలసీ నిబంధనలకు ఆధారం లేకుండా క్లెయిమ్ మొత్తాల్లో కోతలు విధించడం, ఖాతాదారులకు సరైన వివరాలు తెలియజేయకపోవడం వంటి చర్యలకు పాల్పడినట్లు ఇన్యూరెన్స్ రెగ్యూలేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డిఎఐ) గుర్తించింది. ఈ ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణించి ఆ కంపెనీపై ఏకంగా రూ.2 కోట్ల జరిమానా విధిస్తూ నవంబర్ 20న ఆదేశాలు జారీ చేసింది. 2022 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు నిర్వహించిన తనిఖీల్లో ఈ ఉల్లంఘనలు గుర్తించినట్లు ఐఆర్‌డిఎఐ స్పష్టం చేసింది. అనంతరం 2024 డిసెంబర్ 4న షోకాజ్ నోటీసు జారీ చేసింది. 2025 జూన్ 18న వ్యక్తిగత విచారణ నిర్వహించిన తర్వాత జరిమానా నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 క్లెయిమ్‌లతో సహా కొన్ని ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను సమర్థించలేని కారణాలతో తిరస్కరించినట్లు తనిఖీల్లో వెల్లడయ్యింది. పాలసీ నిబంధనలకు మద్దతు లేని కోతలు కూడా విధించినట్లు గుర్తించింది.
అడ్డగోలుగా నిర్ణయాలు....!
క్లెయిమ్‌లకు తిరస్కరణకు అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుందని స్పష్టమవుతోంది. క్లెయిమ్‌లు తిరస్కరించినప్పుడు లేదా తగ్గించినప్పుడు ఏ పాలసీ నిబంధన ఆధారంగా నిర్ణయం తీసుకున్నారో ఖాతాదారులకు స్పష్టంగా తెలియజేయలేదని ఐఆర్‌డిఎఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనివల్ల వినియోగదారులు తమ క్లెయిమ్ నిర్ణయాలను సవాలు చేసేందుకు అవసరమైన సమాచారం పొందలేకపోయారని పేర్కొంది. కొన్ని సందర్భాల్లో నియంత్రణ సంస్థ లోపాలను గుర్తించి సూచించిన తర్వాతే బీమా సంస్థ సంబంధిత మొత్తాలను చెల్లించినట్లు వెల్లడించింది. క్లెయిమ్‌ల తిరస్కరణకు సంబంధించిన ఉల్లంఘనలకు రూ.కోటి, క్లెయిమ్‌లలో ఆధారంలేని కోతలు, పరిష్కార నిర్ణయాల సమాచారంలో లోపాలకు మరో రూ.కోటి జరిమానా విధించింది. ఈ జరిమానాలను బీమా చట్టం 1938లోని సెక్షన్ 102, ఐఆర్‌డిఎఐ ఆరోగ్య బీమా నిబంధనలు-2016, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్-హెల్త్ సర్వీసెస్ నిబంధనలు-2016లోని సంబంధిత నిబంధనల కింద విధించింది.
సంస్థ బోర్డుకు ఆదేశాలు..
నెట్‌వర్క్ ఆసుపత్రులతో అంగీకరించిన డిస్కౌంట్లు ఆసుపత్రి బిల్లుల్లో చూపించకపోవడం, వాటి వివరాలను పాలసీదారులకు తెలియజేయకపోవడంపై కూడా స్టార్ హెల్త్‌ను నియంత్రణ సంస్థ హెచ్చరించింది. క్లెయిమ్ సెటిల్‌మెంట్ లేఖల్లో చెల్లించిన మొత్తం, తిరస్కరించిన మొత్తం, చెల్లించలేని ఖర్చులు, డిస్కౌంట్లు, బీమా మొత్తంలో తగ్గింపులను స్పష్టంగా విడివిడిగా పేర్కొనాలని ఆదేశించింది. పునరుద్ధరణ ప్రీమియంలను 90 రోజుల కంటే ముందుగానే వసూలు చేయడం, ఫిర్యాదుదారులకు ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్ వివరాలు అందించకపోవడంపై కూడా ఐఆర్‌డిఎఐ హెచ్చరికలు జారీ చేసింది. ఈ అంశాల్లో సంస్థ చేపట్టిన సరిదిద్దే చర్యలను నమోదు చేసినట్లు తెలిపింది. జరిమానా ఆదేశాలను సంస్థ బోర్డు ముందు ఉంచాలని, తీసుకున్న చర్యలపై నివేదికను నియంత్రణ సంస్థకు సమర్పించాలని ఆదేశించింది.








కామెంట్‌లు (0)