- ఏడాదికి రూ.30 వేల కోట్ల అదనపు వ్యయం..!
న్యూఢిల్లీ: రష్యాయేతర చమురు దిగుమతులు భారత్‌కు తీవ్ర భారం కానున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బెదిరింపుల నేపథ్యంలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను తగ్గించి ప్రత్యామ్నాయ దేశాల నుంచి భారత్ కొనుగోళ్లు పెంచితే విదేశీ చెల్లింపుల భారం అమాంతం పెరగనుందని రిపోర్టులు వస్తోన్నాయి. భారత ముడి చమురు దిగుమతుల్లో రష్యా కీలక వాటా కలిగి ఉంది. ఈ ఏడాది ఆగస్టులో దేశం దిగుమతి చేసుకున్న మొత్తం ముడి చమురులో రష్యా వాటా 42 శాతంగా ఉంది. దాదాపు రోజుకు దాదాపు 19 లక్షల బ్యారెళ్లుగా నమోదయ్యింది. జులైలో ఇది 52 శాతంగా చోటు చేసుకుంది. అమెరికా ఒత్తిళ్ల కారణంగా రోజుకు 10 లక్షల బ్యారెళ్ల రష్యా చమురును ఇతర దేశాల నుంచి భర్తీ చేయాల్సి వస్తే ఒక్కో బ్యారెల్‌కు అదనంగా 5–10 డాలర్లు చెల్లించాల్సి రావచ్చని యుఎఇకి చెందిన కమాడిటీ విశ్లేషకురాలు నటాలియా కటోనా అంచనా వేశారు. దీంతో భారత్ వార్షిక దిగుమతి బిల్లుపై అదనంగా 1.8–3.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.15,000–30,000 కోట్ల) భారం పడొచ్చని తెలిపారు. రోజుకు 20 లక్షల బ్యారెళ్లను భర్తీ చేయాల్సి వస్తే ఈ వ్యయం మరింత పెరిగి తడిసిమోపెడు కానుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే సరఫరా పరిమితంగా ఉన్న సమయంలో రష్యా చమురుకు ప్రత్యామ్నాయం వెతకడం భారత్‌కు పెద్ద సవాల్‌గా మారనుందని హెచ్చరిస్తున్నారు. ధర కంటే చమురు లభ్యతే ప్రధాన సమస్యగా మారనుందని భావిస్తున్నారు. అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు భారత్‌లో ఇంధన డిమాండ్ అధికంగా ఉండే కాలం. ఈ సమయంలో రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేయాల్సి ఉంటుంది. రష్యా చమురు ఇతర దేశాలతో పోలిస్తే తగ్గింపు ధరలకు లభిస్తుండటంతో దాన్ని అకస్మాత్తుగా పూర్తిగా వదులుకోవడం అంత సులభం కాదని స్పష్టమవుతోంది.
గయానా, నైజీరియా, అమెరికా, బ్రెజిల్ నుంచి ప్రత్యామ్నాయంగా చమురు దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, అవసరమైన స్థాయిలో నిరంతర సరఫరా సాధించడం సవాలేనని నిపుణులు పేర్కొంటున్నారు. దూర ప్రాంతాల నుంచి చమురు రవాణా చేయాల్సి రావడంతో రవాణ వ్యయం కూడా భారీగా పెరుగుతుంది. ఉదాహరణకు బ్రెజిల్ నుంచి భారత్‌కు పెద్ద నౌకల ద్వారా క్రూడ్‌ను తరలించేందుకు రవాణా ఖర్చే 50–51 మిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా.
మార్కెట్ పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే గల్ఫ్ దేశాలు భారత్‌కు ఎప్పటిలాగే ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అక్కడ కూడా సరఫరాలు పరిమితంగా ఉన్నాయి. చైనా నుంచి ముడి చమురుకు డిమాండ్ పెరుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో పోటీ మరింత తీవ్రమవుతోంది. గతంలో ఇరాన్ చమురు దిగుమతులను నిలిపివేసిన పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం రష్యా చమురు దిగుమతులను భర్తీ చేయడం మరింత పెద్ద సవాల్‌గా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.








కామెంట్‌లు (0)