బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ముడిచమురు ధరలకు మళ్లీ రెక్కలు

5 గంటల క్రితం

crude
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 07:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- బ్యారెల్ 107 డాలర్లకు చేరిక

వాషింగ్టన్‌ : అమెరికా యుద్ధోన్మాదంతో ​పశ్చిమాసియాలో రోజురోజుకూ ముదురుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలను మళ్లీ భగ్గుమనిపిస్తున్నాయి. సౌదీ అరేబియాలోని కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన వరుస దాడుల కారణంగా ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక శాతానికి పైగా ఎగబాకాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 1.24 డాలర్లు పెరిగి 107 డాలర్లకు చేరుకోగా, యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) క్రూడ్ బ్యారెల్‌కు 1.29 డాలర్లు బలపడి 102.65 డాలర్ల వద్ద నమోదయ్యింది.

​సౌదీ అరేబియాలోని ఖమిస్ ముషైత్ మిలటరీ ఎయిర్‌బేస్‌పై యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుగల హౌతి తిరుగుబాటుదారులు డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడటంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ దాడుల ప్రభావంతో సౌదీ చమురు ఎగుమతులకు అత్యంత కీలకమైన తూర్పు పశ్చిమ పైప్‌‌లైన్‌ మూతపడింది. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకా రవాణాకు ఆటంకం ఏర్పడినప్పుడు, ప్రత్యామ్నాయంగా ఈ పైప్‌లైన్ ద్వారానే సౌదీ రోజువారీగా సుమారు 4 మిలియన్ బ్యారెళ్ల చమురును రెడ్ సముద్రంలోని యాన్బు ఓడరేవుకు తరలిస్తోంది. తాజా దాడుల కారణంగా ఈ సరఫరా మార్గం నిలిచిపోవడం మార్కెట్ వర్గాలను కలవరపెడుతోంది.

​120 డాలర్లకు చేరొచ్చు..!

ఈ భౌగోళిక రాజకీయ ఘర్షణలు ఇలాగే కొనసాగితే ముడిచమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్ శాచ్స్ హెచ్చరించింది. పరిస్థితి ఇదే విధంగా ఉంటే ముడిచమురు ధర బ్యారెల్‌కు ఏకంగా 120 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ఈ సరఫరా అంతరాయం మరో నెల రోజులు పొడిగితే బ్రెంట్ చమురు ధరపై అదనంగా మరో 7 నుంచి 8 డాలర్ల భారం పడుతుందని జెపి మోర్గాన్ పేర్కొంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో భారత్ వంటి ఇంధన దిగుమతి దేశాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపే అవకాశముందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్