- జులైలో ద్రవ్యోల్బణం 4.5 శాతానికి చేరొచ్చు
- రాయిటర్స్ సర్వే అంచనా
న్యూఢిల్లీ : దేశంలో వర్షపాతం తగ్గుదల, వ్యవసాయ ఉత్పత్తి పడిపోవడం కారణంగా ఆహార ధరలు మళ్లీ పెరగొచ్చని రాయిటర్స్ సర్వేలో నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో జులై నెలలో వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 4.50 శాతానికి చేరే అవకాశముందని అంచనా వేశారు. ఆగస్టు 5-7 మధ్య 40 మంది ఆర్థిక నిపుణులతో నిర్వహించిన ఈ సర్వే ప్రకారం.. జూన్‌లో 4.38 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం.. జులైలో మరింత పెరగవచ్చని అంచనా. అధికారిక గణాంకాలను ఆగస్టు 12న విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా అసమాన వర్షపాతం లోటు వల్ల పంటల ఉత్పత్తి దెబ్బతినడం ఆహార ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొన్నారు. భారతీయ కుటుంబాలు తమ వ్యయంలో 40 శాతానికి పైగా ఆహారానికే ఖర్చు చేస్తున్నందున ఈ ధరల పెరుగుదల నేరుగా కుటుంబ బడ్జెట్‌పై ప్రభావం చూపుతుందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కనికా పస్రీచా తెలిపారు. అయితే ఆహారం, ఇంధనాన్ని మినహాయించినప్పటికీ ఇతర కీలక ద్రవ్యోల్బణం జులైలో 4.08 శాతంగా ఉండే అవకాశం ఉందని అంచనా.
రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెల కూడా 4 శాతం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే అది ఆర్‌బిఐ నిర్దేశించిన 2-6 శాతం పరిమితిలోనే కొనసాగుతోంది. దీంతో ఇటీవల జరిగిన ద్రవ్య విధాన సమీక్షలో ఆర్‌బిఐ కీలక రెపో రేటును యథాతథంగా కొనసాగించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి ద్రవ్యోల్బణానికి ప్రధాన ప్రమాదాలుగా ఆర్‌బిఐ పేర్కొనగా, దేశీయంగా ఇంధన ధరలు స్థిరంగా ఉండటం కొంత ఉపశమనంగా భావిస్తోంది. మరోవైపు జులైలో టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూన్ స్థాయి అయిన సుమారు 9.95 శాతం వద్దే కొనసాగవచ్చని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 5.0 శాతంగా ఉండవచ్చని ఆర్‌బిఐ ఇప్పటికే తన అంచనాల్లో పేర్కొంది.








కామెంట్‌లు (0)