- బ్యారెల్ ధర 70 డాలర్లకు తగ్గుదల
- సామాన్యుడికి మాత్రం తప్పని సెగ!
న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు నాలుగు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం, హర్మూజ్ జలసంధి తిరిగి ప్రారంభం కావడంతో బ్యారెల్ ముడి చమురు ధర సుమారు 120 డాలర్ల నుంచి 70 డాలర్లకు పడిపోయింది. ఇవి పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభం కాకముందు నాటి ధరలు కావడం విశేషం. ఈ నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయనే అంశంపై సామాన్య ప్రజల్లో ఆసక్తి నెలకొంది. మే 15 నుంచి దేశంలో ఇంధన ధరలు లీటరుకు సుమారు రూ.7.50 వరకు పెరిగాయి. ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 70 డాలర్లకు పడిపోయినప్పటికీ భారత వినియోగదారులకు మాత్రం ధరల తగ్గింపు ఊరట లభించడం లేదు. సామాన్యులపై భారం తగ్గించడానికి మోడీ సర్కార్ కానీ.. చమురు మార్కెటింగ్ సంస్థలు కానీ ఏమాత్రం సిద్ధంగా లేకపోవడం ఆందోళనకరం.
ధరలు తగ్గకపోవడానికి ప్రభుత్వం చూపుతున్న కారణాలు ఏమాత్రం సహేతుకంగా లేవని నిపుణులు భావిస్తున్నారు. ముడిచమురు ధరలు గరిష్టంగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను లీటరుకు రూ. 10 చొప్పున తగ్గించడం ద్వారా ఆ భారాన్ని తామే మోశామని.. ఇప్పుడు ఆ ఆదాయ నష్టాన్ని పూడ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు గత నాలుగు నెలలుగా కొనుగోలు ధర కంటే తక్కువకే ఇంధనాన్ని విక్రయించడం వల్ల రూ.74,781 కోట్ల మేర నష్టపోయాయని ఆ లోటును భర్తీ చేయడానికి 6 నుంచి 12 నెలల సమయం పడుతుందని చెబుతున్నాయి. రిఫైనరీలకు ఇప్పటికీ అధిక ధరలకే ముడిచమురు అందుతోందని సాకులు చెబుతూ.. అంతర్జాతీయ ప్రయోజనాలను సామాన్యులకు చేరవేయకుండా నిలిపివేస్తున్నారు. రాబోయే రోజుల్లో ముడిచమురు ధరలు ఇదే రీతిలో తక్కువగా ఉన్నప్పటికీ 2026 చివరి వరకు ధరల తగ్గింపు అసాధ్యమని ప్రభుత్వ వర్గాలు పేర్కొనడం గమనార్హం.







కామెంట్‌లు (0)