బిజినెస్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప లాభాలతో ఫ్లాట్‌గా ముగిశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చితి ప్రభావంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. దీంతో రోజంతా సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి.
మార్కెట్‌లో పీఎస్‌యూ, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాల షేర్లపై అమ్మకాల ఒత్తిడి కనిపించింది. మరోవైపు రియాల్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ క్రితం ముగింపు 78,499.17 పాయింట్లతో పోలిస్తే 78,501.59 వద్ద స్వల్ప లాభంతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 78,676.98 పాయింట్ల గరిష్ఠాన్ని, 78,298.92 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 43.27 పాయింట్లు లాభపడి 78,542.44 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 13.15 పాయింట్లు పెరిగి 24,583.80 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.31 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్-30లో టైటాన్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎస్‌బీఐ, ఎటర్నల్, ఎన్‌టీపీసీ, ఐటీసీ, టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 84.33 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. ఔన్స్ బంగారం ధర 4,340.09 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.








కామెంట్‌లు (0)