సెన్సెక్స్ 353 పాయింట్లు డౌన్
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లపై ఐటి, చమురు, గ్యాస్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి తీవ్ర ప్రభావం చూపింది. బుధవారం బిఎస్‌ఇ సెన్సెక్స్ 353 పాయింట్లు క్షీణించి 73,246కు పరిమితమయ్యింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయి 22,699కు దిగజారింది. ఒక దశలో సెన్సెక్స్ 72,604 పాయింట్లకు, నిఫ్టీ 22,498 పాయింట్లకు పడిపోయాయి. అయితే ఆటోమొబైల్, ఎంపిక చేసిన బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లతో సూచీలు కనిష్ఠ స్థాయుల నుంచి కొంత కోలుకున్నాయి. ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఒఎన్‌జిసి షేర్లు ప్రధానంగా నష్టపోగా, లార్సెన్ అండ్ టూబ్రో, అపోలో హాస్పిటల్స్, ట్రెంట్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 0.5 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.8 శాతం పెరిగాయి. రంగాలవారీగా నిఫ్టీ ఆటో సూచీ 1.5 శాతం, బ్యాంక్ నిఫ్టీ 0.5 శాతం లాభపడగా, ఐటి, చమురు–గ్యాస్ సూచీలు దాదాపు 2 శాతం చొప్పున పడిపోయాయి. ఎఫ్‌ఎంసిజి సూచీ 0.6 శాతం నష్టపోయింది. కీలక రంగాల షేర్లలో అమ్మకాలే ప్రధాన సూచీలపై ఒత్తిడి పెంచాయి.








కామెంట్‌లు (0)