- సెన్సెక్స్ 800 పాయింట్లు పతనం
- మూడో రోజూ నేల చూపులు
ముంబయి : అమెరికా విధానాలతో అంతర్జాతీయంగా ముంచుకొస్తున్న యుద్ధ మేఘాలు, ముడి చమురు ధరల అసాధారణ పెరుగుదల దేశీయ స్టాక్ మార్కెట్లను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. దలాల్ స్ట్రీట్‌లో వరుసగా మూడో రోజు కూడా అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా కొనసాగింది. పశ్చిమాసియాలో రాజుకున్న ఉద్రిక్తతలు మదుపర్లను భయాందోళనలకు గురిచేయడంతో బుధవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 813 పాయింట్లు పతనమై 74,764కు పడిపోయింది. అదే బాటలో నిఫ్టీ50 సుమారు 204 పాయింట్లు కోల్పోయి 23,431 వద్ద ముగిసింది. ఈ ఒక్క రోజే బిఎస్‌ఇలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఏకంగా రూ. 2 లక్షల కోట్లకు పైగా ఆవిరై రూ.484 లక్షల కోట్లకు పడిపోయింది.
ప్రధాన కారణాలు..
ఇరాన్-అమెరికా ఘర్షణలు తీవ్రతరం కావడంతో భౌగోళిక రాజకీయ పరిస్థితులు పూర్తిగా దిగజారాయి. యెమెన్‌లోని ఇరాన్ మద్దతుగల హౌతీ రెబెల్స్ సౌదీ అరేబియా నగరాలపై క్షిపణి దాడులకు పాల్పడటం, అమెరికా బలగాలు ఇరాన్‌కు చెందిన పలు ఆయిల్ ట్యాంకర్లను ధ్వంసం చేయడం ఉద్రిక్తతలను తారాస్థాయికి చేర్చింది. మరోవైపు జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ దాడి జరగడం, గల్ఫ్ జలాల్లో నౌకలపై దాడులు పెరగడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. యుద్ధ తీవ్రత పెరుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆయిల్ ధర బ్యారెల్ 100 డాలర్ల మార్కును దాటింది. రాబోయే రోజుల్లో చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక సంస్థలు హెచ్చరించడం మార్కెట్లను తీవ్ర ఒత్తిడికి గురి చేశాయి.
మార్కెట్ పతనంలో టెక్నాలజీ దిగ్గజాలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ ఐటి ఇండెక్స్ ఏకంగా 3 శాతానికి పైగా కుప్పకూలింది. ఇన్ఫోసిస్, టిసిఎస్, టెక్ మహీంద్రా తదితర షేర్లు 2 నుంచి 5 శాతం వరకు నష్టపోయి సూచీలను కిందికి లాగాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95.1050 స్థాయికి పడిపోయింది. విదేశీ సంస్థాగత మదుపర్లు వరుసగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం భారతీయ కరెన్సీపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోందని ఎల్‌కెపి సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో రూపాయి కదలికలు మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది. భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థాగత మదుపర్లు నికర అమ్మకందారులుగా కొనసాగుతున్నారు. ఈ నెలలో ఇప్పటికే పలు సెషన్లలో వారు పెద్దఎత్తున షేర్లను విక్రయించడం దలాల్ స్ట్రీట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. నిఫ్టీ సూచీ తన వరుస బేరిష్ ధోరణిని కొనసాగిస్తూ స్వల్పకాలంలో 23,300 - 23,200 స్థాయిల వరకు పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.








కామెంట్‌లు (0)