- ఎపి అంగన్‌వాడీ అండ్ హెల్పర్స్ యూనియన్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి బేబీరాణి, కె సుబ్బరావమ్మ బుధవారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ కు ఈ మెయిల్ ద్వారా వినతిపత్రాన్ని పంపారు. 2019 నుంచి అంగన్వాడీల వేతనాలు పెరగలేదని, ఈ కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. వివిధ యాప్‌లను ప్రవేశపెట్టి అంగన్వాడీలపై పని భారం పెంచారని పేర్కొన్నారు. వేతనాల పెంపుకు అనేక దఫాలుగా పోరాటాలు చేసిన ఫలితంగా 2024 జూన్‌లో వేతనాలు పెంచుతామని మినిట్స్ కాపీ ఇచ్చారని తెలిపారు. 2026 మార్చి 2న, అనంతరం మార్చి 10న ఐసిడిఎస్ మంత్రి అంగన్వాడీ యూనియన్ నాయకులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరలో వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని తెలిపారు. నేటికీ ఆ హామీ అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న అంగన్వాడీలు, వారి కుటుంబ సభ్యులకు వైద్యం, పదవీ విరమణ, పెన్షన్ తదితర సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని వినతిపత్రంలో వివరించారు. అంగన్వాడీలకు రేషన్ కార్డులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. అంగన్ వాడీలకు తల్లికి వందనం అమలు చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. హెల్పర్ల ప్రమోషన్ మార్గదర్శకాలకు సంబంధించిన జిఒ 5ను సవరించాలని, పెండింగ్‌లో ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. 1972 పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయాలని తెలిపారు. నవచేతన యాప్, ఐవిఆర్ కాల్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)