వెయ్యి పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా ఎన్నికల ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలతో వరుసగా ఆరో రోజు సూచీలు లాభాల్లో దూసుకెళుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిస్థితులు, ముడి చమురు ధరల తగ్గుదల, విదేశీ పెట్టుబడుల పెరుగుదలతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్ల కొనుగోలుకు ఆసక్తి చూపారు.
ఉదయం 10.15 గంటల సమయానికి నిఫ్టీ 407.80 పాయింట్లు పెరిగి 24,360 స్థాయిని దాటింది. సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా లాభపడింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, రియల్టీ రంగాల షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి.
అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు నమోదు చేయడం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 8.7 శాతం తగ్గి బ్యారెల్‌కు 94 డాలర్ల దిగువకు చేరాయి. దీంతో చమురు దిగుమతుల వ్యయం తగ్గుతుందనే అంచనాలు మార్కెట్‌కు ఊతమిచ్చాయి.
విదేశీ పెట్టుబడిదారులు బుధవారం ఒక్కరోజే రూ.7,284 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. వరుసగా నాలుగో రోజు కూడా కొనుగోళ్లు కొనసాగించడం మార్కెట్లకు బలాన్నిచ్చింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గవచ్చనే అంచనాలు కూడా ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచాయి.
డాలర్ విలువ తగ్గడం, బాండ్ ఈల్డ్స్ పడిపోవడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి 12 పైసలు బలపడటం కూడా మార్కెట్‌కు కలిసొచ్చాయి. రెండో త్రైమాసికంలో కంపెనీల ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో రానున్న రోజుల్లోనూ మార్కెట్లు లాభాల బాటలో కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.








కామెంట్‌లు (0)