న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ శనివారం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ... దేశంలో జులై నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది జులైతో పోలిస్తే ఇవి 15.4 శాతం పెరగడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో నెలవారీ జీఎస్‌టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మార్కును అధిగమించడం ఇది రెండోసారి. అంతకుముందు ఏప్రిల్‌లో రూ.2.43 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూలైంది.
జీఎస్‌టీ వసూళ్లలో నమోదైన ఈ పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు బలంగా కొనసాగుతున్నాయనే సంకేతాలను ఇస్తోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గత 14 నెలల్లో నమోదైన అత్యధిక వార్షిక వృద్ధి ఇదేనని వెల్లడించింది. దేశీయ వినియోగం పెరగడం, వ్యాపార కార్యకలాపాలు ఊపందుకోవడం వల్లే ఈ వృద్ధి సాధ్యమైందని తెలిపింది. గత ఏడాది జులైలో రూ.1.83 లక్షల కోట్లుగా ఉన్న స్థూల జీఎస్‌టీ వసూళ్లు ఈసారి రూ.2.11 లక్షల కోట్లకు పెరిగాయి.
దేశీయ లావాదేవీల నుంచి వచ్చే జీఎస్‌టీ ఆదాయం 10.1 శాతం వృద్ధితో రూ.1.45 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే నెలలో ఇది రూ.1.31 లక్షల కోట్లుగా నమోదైంది. మరోవైపు దిగుమతులపై జీఎస్‌టీ వసూళ్లు 28.8 శాతం పెరిగి రూ.66,511 కోట్లకు చేరుకోవడం గమనార్హం. దీంతో మొత్తం జీఎస్‌టీ వసూళ్లలో దిగుమతుల వాటా కూడా పెరిగింది.
జులై నెలలో జీఎస్‌టీ రీఫండ్‌లు 13.1 శాతం పెరిగి రూ.29,968 కోట్లుగా నమోదయ్యాయి. రీఫండ్‌లను మినహాయించిన తర్వాత నికర జీఎస్‌టీ ఆదాయం రూ.1.81 లక్షల కోట్లకు చేరగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 15.8 శాతం అధికం. ఇందులో దేశీయ నికర ఆదాయం 10.5 శాతం పెరిగి రూ.1.27 లక్షల కోట్లుగా నమోదైంది. కస్టమ్స్ జీఎస్‌టీ ద్వారా వచ్చిన నికర ఆదాయం 30.3 శాతం వృద్ధితో రూ.54,223 కోట్లకు చేరింది.
2026-27 ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో మొత్తం జీఎస్‌టీ వసూళ్లు రూ.8.43 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో ఇవి రూ.7.66 లక్షల కోట్లుగా ఉండగా, ఈసారి 10.1 శాతం వృద్ధి నమోదైంది. ఇదిలా ఉండగా, ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం జీఎస్‌టీతో పాటు ప్రాథమిక ఎక్సైజ్ సుంకంలో రాష్ట్రాల వాటాను పరిగణనలోకి తీసుకుంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.1.43 లక్షల కోట్ల మేర అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని అంచనా వేసింది.








కామెంట్‌లు (0)