ముంబయి : పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వంటి పరిణామాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా క్షీణించగా, నిఫ్టీ 24 వేల మార్కు వద్ద ఊగిసలాడుతోంది.
సోమవారం ఉదయం 9.31 గంటల సమయంలో సెన్సెక్స్ 605 పాయింట్లు పడిపోయి 76,964 వద్ద కొనసాగగా, నిఫ్టీ 177 పాయింట్లు కోల్పోయి 24,029 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సూచీలో టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఓఎన్‌జీసీ, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా షేర్లు స్వల్ప లాభాల్లో ఉండగా.. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.72 వద్ద ప్రారంభమైంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరగడం పెట్టుబడిదారుల్లో ఆందోళనకు దారితీసింది. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఐఆర్‌జీసీ దాడి జరిగినట్లు వార్తలు రావడంతో పాటు, భారతీయ సిబ్బందిలో ఒకరు గల్లంతైనట్లు సమాచారం. దీనికి ప్రతిగా అమెరికా ఇరాన్‌పై దాడులు జరపగా, స్పందనగా బహ్రెయిన్, కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలను టెహ్రాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర నాలుగు శాతం పెరిగి బ్యారెల్‌కు 79.26 డాలర్లకు చేరుకోవడంతో, దాని ప్రభావం దేశీయ ఈక్విటీ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది.







కామెంట్‌లు (0)