దలాల్ స్ట్రీట్‌లో పారదర్శకతకు పాతర..
ఎఫ్‌పిఐ వివరాల వెల్లడికి సుప్రీం నిరాకరణ..
ముంబయి : భారత స్టాక్ మార్కెట్లోకి వస్తోన్న విదేశీ పెట్టుబడుల వెనుక అసలు వ్యక్తులు, సంస్థలు ఎవరనే కీలక ప్రశ్నకు ఇప్పట్లో సమాధానం దొరికేలా లేదు. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐ), ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ (ఎఐఎఫ్) ద్వారా వస్తున్న పెట్టుబడుల అంతిమ లబ్ధిదారుల వివరాలను బహిరంగపరచాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని ఆదేశించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇందుకు అవసరమైన చట్టపరమైన నిబంధనలు లేనప్పుడు.. ఆర్టికల్ 32 కింద న్యాయస్థానం కొత్త విధానాన్ని సృష్టించలేదని స్పష్టం చేసింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రా దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్, జస్టిస్ డి.కె. ఉపాధ్యాయలతో కూడిన ధర్మాసనం తీర్పును వెల్లడించింది. ఇది విదేశీ నిధుల పారదర్శకత, చిన్న మదుపర్ల ప్రయోజనాల పరిరక్షణపై మరోసారి చర్చకు తెరలేపింది. కంపెనీల ప్రమోటర్లు విదేశీ సంస్థల ముసుగులో ఈ డార్క్ మని (తెరచాటు నగదు)ను చెలామణి చేస్తోన్నారనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రధాన ఆరోపణ.
కృత్రిమ ధరలకు అవకాశం..
పిటిషనర్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. విదేశీ పెట్టుబడుల వెనుక ఉన్న అసలు లబ్ధిదారుల వివరాలు ప్రజలకు తెలియకపోవడం మార్కెట్ పారదర్శకతకు విఘాతమని వాదించారు. ఎఐఎఫ్‌లు, ఎఫ్‌పిఐల ద్వారా భారీ మొత్తంలో పెట్టుబడులు వస్తున్నప్పటికీ, వాటిని నియంత్రించే అసలు వ్యక్తులు ఎవరో వెల్లడికావడం లేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కంపెనీల ప్రమోటర్లు విదేశీ సంస్థల ముసుగులో తమ కంపెనీల షేర్లను కొనుగోలు చేసి, ధరలను కృత్రిమంగా పెంచే ప్రమాదం ఉందని వివరించారు. షేర్ల ధరలు పెరుగుతున్నాయన్న ప్రచారంతో సాధారణ మదుపర్లు పెట్టుబడులు పెట్టి, ఆ తర్వాత ధరలు కుప్పకూలినప్పుడు భారీగా నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.
2018లో తొలగించిన నిబంధనలు..
లబ్ధిదారుల వివరాల వెల్లడింపునకు సంబంధించిన నిబంధనలు 2018కు ముందు అమల్లో ఉండేవని ప్రశాంత్ భూషణ్ గుర్తుచేశారు. ఆ తర్వాత వాటిని తొలగించడంతో పారదర్శకతకు విఘాతం కలిగిందని వాదించారు. ప్రస్తుతం మనీలాండరింగ్ నిరోధక చట్టం (ఫెమా) కింద కొన్ని వివరాల వెల్లడించడానికి వీలునప్పటికీ అది ప్రజలకు పూర్తి సమాచారం అందించేందుకు సరిపోదన్నారు. అదానీ–హిండెన్‌బర్గ్ వివాదంపై నియమించిన నిపుణుల కమిటీ కూడా విదేశీ పెట్టుబడుల అంతిమ లబ్ధిదారుల వివరాల గుర్తింపు, వెల్లడింపులో ఉన్న లోపాలను ప్రస్తావించిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సమాచారం తెలుసుకునే హక్కు ప్రాథమిక హక్కులో భాగమని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర, విద్యార్హతలను వెల్లడించాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఉదహరించారు.
పెట్టుబడులను నిరుత్సాహపర్చడమే : కేంద్రం
పిటిషన్‌ను కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యతిరేకించారు. విదేశీ పెట్టుబడుల వివరాలను బహిరంగపరచడం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని, పెట్టుబడిదారుల్లో భయాందోళనలు సృష్టిస్తుందని వాదించారు. ఈ పిటిషన్ ఉద్దేశం విదేశీ పెట్టుబడులను నిరుత్సాహపరచడమేనని ఆరోపించారు. దీనికి భూషణ్ బదులిస్తూ.. పెట్టుబడిదారుల వివరాలను వెల్లడించడం వల్ల ఎవరికీ నష్టం ఉండదని, పైగా మార్కెట్‌లో ధరల కృత్రిమ పెరుగుదల వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. చిన్న మదుపర్లను మోసాల నుంచి కాపాడేందుకు పారదర్శకత అవసరమని స్పష్టం చేశారు.
సెబీ, పార్లమెంట్ బాధ్యత..?
పెట్టుబడుల వివరాలు సెబీకి, కస్టోడియన్లకు అందుతున్నప్పటికీ, సంస్థల వారీగా అంతిమ లబ్ధిదారుల వివరాలను ప్రజలకు వెల్లడించే నిర్దిష్ట చట్టపరమైన వ్యవస్థ లేదని ధర్మాసనం పేర్కొంది. అటువంటి వ్యవస్థను రూపొందించేందుకు కోర్టు నేరుగా ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. గతంలో ఎన్నికల అభ్యర్థుల వివరాల వెల్లడింపుపై న్యాయస్థానం జోక్యం చేసుకున్న సందర్భాలను ప్రస్తావించినప్పటికీ.. ప్రస్తుత అంశంలో ప్రత్యేక చట్టపరమైన వ్యవస్థ అవసరమని అభిప్రాయపడింది. దీంతో విదేశీ నిధుల పారదర్శకతపై ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోయింది. చట్టపరమైన వ్యవస్థను రూపొందించాల్సిన బాధ్యత ఇప్పుడు సెబీ, పార్లమెంట్‌పై ఉందని స్పష్టమవుతోంది. విదేశీ నిధుల పారదర్శకతను పెంచి చిన్న మదుపర్లను రక్షించే చట్టపరమైన వ్యవస్థను రూపొందించాల్సిన బాధ్యత మాత్రం సెబీ, పార్లమెంట్‌పైనే ఉందని నిపుణులు భావిస్తున్నారు.








కామెంట్‌లు (0)