శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సజావుగా సాగేనా..!

1 గంట క్రితం

sasa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 11:14 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • పొంచి వున్న వర్షం ముప్పు

  • నేడు భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య రెండో వన్డే

  • ఉదయం 7.30గం.ల నుంచి

వెల్లింగ్టన్‌: తొలి వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా.. అదే ఉత్సాహంతో రెండో వన్డేకు సిద్ధమైంది. ఆక్లాండ్‌ వేదికగా జరిగిన ఆ వన్డేలో బౌలర్లు సమిష్టిగా చెలరేగి కివీస్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు. ఛేదనలో భాగంగా టీమిండియా ఓపెనర్లు నిరాశపరిచినా.. సీనియర్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అర్ధసెంచరీతో రాణించి గెలుపులో కీలకపాత్ర పోషించాడు. వర్షం కారణంగా కుదించిన ఆ మ్యాచ్‌లో టీమిండియా సమిష్టిగా రాణించి ఐదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి శుభారంభం చేసింది. ఇక వెల్లింగ్టన్‌ వేదికగా శనివారం జరిగే రెండో వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఇక్కడి వాతావరణ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో శనివారం జరిగే మ్యాచ్‌ సజావుగా సాగడం కష్టమేనని, ఆరోజు కూడా వర్షం కురిసే అవకాశాలే అధికంగా ఉన్నట్లు పేర్కొంది. శనివారం ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల నుండి 20 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు.. పగటిపూట వర్షం పడే అవకాశం 60 శాతం ఉన్నట్లు తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత వర్షం పడే అవకాశం అధికంగా ఉంటుందని పేర్కొంది. శుక్రవారం వెల్లింగ్టన్‌లో భారీ వర్షం కురవడంతో ఇరుజట్లు ప్రాక్టీస్‌ సెషన్స్‌ను రద్దు చేసుకున్నాయి. కానీ న్యూజిలాండ్‌ ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేసింది. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యతలో ఉంది.

వన్డే ప్రపంచకప్‌కు సన్నద్ధం : కెప్టెన్‌ గిల్‌

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ప్రపంచకప్‌-2027 టోర్నీకి గొప్ప సన్నాహకంగా ఉపయోగపడు తుందని టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ అన్నాడు. దక్ష‍ిణాఫ్రికా మాదిరి పిచ్‌లపై కివీస్‌ పిచ్‌లు ఉంటాయని, ఈ సిరీస్‌ తమకు ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డాడు. కాగా కివీస్‌తో​ ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత టి20 సిరీస్‌ జరగ్గా.. శ్రేయస్‌ అయ్యర్‌ సేన.. 3-2 సిరీస్‌ను కైవసం చేసుకొంది. ఇక తొలి వన్డేలో శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీలో భారత్‌ విజయం సాధించింది. తొలి వన్డేలో రాణించిన పేస్‌ బౌలింగ్‌ విభాగంపై గిల్‌ ప్రశంసలు కురిపించాడు. అన్షుల్‌ కాంబోజ్‌, ఆకిబ్‌ నబీ, గుర్నూర్‌ బ్రార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లు తొలి వన్డేలో అద్భుతంగా రాణించారని కొనియాడాడు. అదే సమయంలో టి20 కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘‘శ్రేయస్‌ అద్భుతంగా జట్టును ముందుకు నడిపించాడని పేర్కొన్నాడు.

కివీస్‌ను తక్కువ అంచనా వేయొద్దు..

న్యూజిలాండ్‌ లాంటి కఠినమైన పిచ్‌లపై వరుసగా మ్యాచ్‌లు గెలవడం అంత సులువేమీ కాదు. ముఖ్యంగా తొలి రెండు టీ20లలో ముందుగా జట్టు అంత గొప్ప స్థితిలో లేదు. కానీ ఆ తర్వాత పుంజుకుని విజయం సాధించింది. ఇలాంటి విజయాలు జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. ఈ సిరీస్‌ గెలవడం ద్వారా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి’’ అని గిల్‌ అన్నాడు. కాగా భారత టీ20 జట్టు సారథిగా సూర్యకుమార్‌ యాదవ్‌ స్థానాన్ని శ్రేయస్‌ అయ్యర్‌ భర్తీ చేయగా.. వన్డే, టెస్టు జట్లకు గిల్‌ నాయకుడిగా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌-2026కు ముందే గిల్‌ టీ20 జట్టులో స్థానం కోల్పోయాడు.

కివీస్‌కు ఎదురుదెబ్బ

తొలి వన్డేకు ముందు ట్రైనింగ్‌ సమయంలో కివీస్ బ్యాటర్ డేవన్ కాన్వే గాయపడ్డాడు. దీంతో అతడు ఆ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు సిరీస్‌ నుంచి వైదొలిగాడు. అతడికి బదులు కంకషన్‌ ఆటగాడిగా నిక్ కెల్లీ జట్టులోకి వచ్చాడు. డేవన్ కాన్వేతో ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడిన మ్యాట్ హెన్రీ ఫిట్‌నెస్ సాధించడంతో సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నట్లు కివీస్ బోర్డు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

జట్లు(అంచనా)...

ఇండియా: గిల్‌(కెప్టెన్‌), రోహిత్‌, కోహ్లి, శ్రేయస్‌, అక్ష‍ర్‌, కెఎల్‌ రాహుల్‌(వికెట్‌ కీపర్‌), నమన్‌ ధీర్‌, కంబోజ్‌, ఆకిబ్‌ నబీ/సిరాజ్‌, గుర్నూర్‌ బ్రార్‌, ఆర్ష్‌దీప్‌.

న్యూజిలాండ్‌: సాంట్నర్‌(కెప్టెన్‌), షెఫర్ట్‌, యంగ్‌, నికోల్స్‌, మిఛెల్‌, లాథమ్‌(వికెట్‌ కీపర్‌), ఫిలిప్స్‌, స్మిత్‌, జేమీసన్‌, డఫీ/హెన్రీ, టిక్నెర్‌.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్