- వారంలో 2.6 బిలియన్ డాలర్లు తగ్గుదల
న్యూఢిల్లీ : భారత విదేశీ మారకం నిల్వలు మరింత పతనమయ్యాయి. ఆర్‌బిఐ శుక్రవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. అక్టోబర్ 30తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వులు 2.6 బిలియన్ డాలర్లు క్షీణించి 717 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. సెప్టెంబర్ 4తో ముగిసిన వారంలో రికార్డ్ స్థాయిలో 785.7 బిలియన్ డాలర్ల వద్ద ఆల్‌టైమ్ రికార్డును తాకిన విదేశీ నిల్వలు.. అప్పటి నుండి తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. విదేశీ మారక ద్రవ్య రూపంలో సేకరించిన నిధులను వినియోగించడం, రూపాయి మారకం విలువకు మద్దతుగా డాలర్ల విక్రయం ద్వారా ఆర్‌బిఐ మార్కెట్లో జోక్యం చేసుకోవడమే ఈ క్షీణతకు కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అక్టోబర్ 30 నాటికి విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సిఎ) 2.08 బిలియన్ డాలర్లు తగ్గి 591.11 బిలియన్ డాలర్లకు చేరగా, పసిడి నిల్వల విలువ 559 మిలియన్ డాలర్లు తగ్గి 102.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అదేవిధంగా స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డిఆర్) 47 మిలియన్ డాలర్లు తగ్గి 18.5 బిలియన్ డాలర్లకు పరిమితం కాగా, ఐఎంఎఫ్ వద్ద భారత రిజర్వు పొజిషన్ మాత్రం 3 మిలియన్ డాలర్లు పెరిగి 4.79 బిలియన్ డాలర్లకు చేరింది.








కామెంట్‌లు (0)