సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

1089 సంఖ్యతో తమాషా

1 గంట క్రితం

1089
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 04:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

హాయ్ విద్యార్థులూ,

‘ఈ రోజు ఒక మ్యాజిక్ చేద్దాం. ఒక తెల్ల కాగితం తీసుకుని దానిపై మూడు అంకెల సంఖ్యను రాయాలి. ఆ సంఖ్యలో ఒకట్ల స్థానంలోని అంకె కంటే వందల స్థానంలోని అంకె పెద్దదిగా ఉండాలి’ అని మాస్టారు చెప్పగానే ఓ విద్యార్థి 723 సంఖ్యను పేపరుపై రాశాడు. ఆ సంఖ్యను మాస్టారు చెప్పిన విధంగా చేస్తూ వెళ్లాడు. మొదట తీసుకున్న సంఖ్యను తిరగవేసి రాసి, వచ్చిన సంఖ్యను మొదటి సంఖ్య నుంచి తీసివేశాడు.

723 – 327 = 396

ఇప్పుడు ఈ సంఖ్యను తిరగ రాశాడు. అప్పుడు 693 వచ్చింది. ఆ సంఖ్యను 396కు కలిపాడు. అయితే వచ్చిన జవాబును బయటకు చెప్పవద్దని మాస్టారు చెప్పారు. ఒక కాగితంపై ఆ జవాబు రాసి తనకు కాకుండా మిగతా విద్యార్థులకు చూపించి మడత పెట్టమన్నారు. తర్వాత ఒక అగ్గిపెట్టె తీసుకొచ్చి ఆ కాగితాన్ని కాల్చమన్నారు. విద్యార్థి పేపర్‌ను కాల్చిన తర్వాత వచ్చిన నల్లని మసిని మాస్టారు తన అరచేతిలో వేసుకుని ‘ఉఫ్‌’ అని ఊదారు. ఆశ్చర్యంగా ఆయన చేతిపై 1089 అనే సంఖ్య నల్లని మసితో కనిపించింది. అది చూసి విద్యార్థులంతా ఆశ్చర్యపోయారు.

కిటుకు:

మీరు ఏ మూడు అంకెల సంఖ్య తీసుకున్నా, పై విధానాన్ని సరిగ్గా పాటిస్తే చివరకు 1089 వస్తుంది. కాబట్టి మాస్టారుకు జవాబు ముందే తెలుసు. ఆయన చేతిపై ముందుగానే తడి సబ్బు నురుగుతో 1089 రాసుకున్నారు. చివరలో కాల్చిన కాగితం మసిని చేతిపై వేసినప్పుడు, ఆ మసి సబ్బు నురుగు ఉన్న చోట మాత్రమే అంటి 1089 స్పష్టంగా కనిపించింది.

ఇంకా 1089 సంఖ్యతో ఒక ఆసక్తికరమైన గుణకార విశేషం కూడా ఉంది.

1089 × 1 = 1089

1089 × 2 = 2178

1089 × 3 = 3267

1089 × 4 = 4356

1089 × 5 = 5445

1089 × 6 = 6534

1089 × 7 = 7623

1089 × 8 = 8712

1089 × 9 = 9801


ఈ గుణకార ఫలితాలను పరిశీలిస్తే వేల స్థానంలోని అంకెలు పై నుంచి కిందకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9గా ఉన్నాయి. వందల స్థానంలోని అంకెలు 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8గా ఉన్నాయి. పదుల స్థానంలోని అంకెలు 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0గా ఉన్నాయి. ఒకట్ల స్థానంలోని అంకెలు 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1గా ఉన్నాయి.


1089 × 1 = 1089  1089 × 2 = 2178  1089 × 3 = 3267  1089 × 4 = 4356


1089 × 9 = 9801  1089 × 8 = 8712  1089 × 7 = 7623  1089 × 6 = 6534


– మడ్డు తిరుపతిరావు

గణిత అవధాని & టీచరు, బూరగాం,

కంచిలి, శ్రీకాకుళం.

94913 26473

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్