హాయ్ ఫ్రెండ్స్,
మా స్కూల్లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు మేము ఒక చక్కని పరిష్కారం కనుగొన్నాం. మా ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఒక పర్యావరణ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం. ఎల్‌కేజీ నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరూ ఇందులో భాగస్వాములయ్యారు. ఈ ప్రాజెక్ట్ కింద పాఠశాలలోని ప్రతి క్లాస్‌రూమ్‌లో ఒక ఖాళీ ప్లాస్టిక్ సీసాను ఉంచాం. విద్యార్థులు రోజూ తినే చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్ వంటి తినుబండారాల కవర్లను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా, ఆ ప్లాస్టిక్ సీసాలలో వేయమని చెప్పాం. విద్యాసంవత్సరం ముగిసే సమయానికి, ప్రతి క్లాస్ నుండి ఆ సీసాలను సేకరించాం. అవన్నీ ఒక పెద్ద గోడను నిర్మించడానికి సరిపోయే పటిష్టమైన ఇకో-బ్రిక్స్ గా మారాయి. వందలాది ఆ బ్రిక్స్ ను ఉపయోగించి మా పాఠశాల యాజమాన్యం పిల్లల ఆటస్థలంలో అందమైన గోడలను నిర్మించింది. పడేసే చెత్తతో పిల్లలు ఆడుకునే స్థలంలోనే ఇంత ఉపయోగకరమైన మౌలిక వసతిని నిర్మించుకున్నాం. ఇదే ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత. ఇందులో చిన్న క్లాసుల పిల్లల నుండి పెద్ద తరగతుల పిల్లల వరకు భాగస్వామ్యం కావడం వల్ల మా అందరికీ పర్యావరణాన్ని రక్షించడం పట్ల అవగాహన ఏర్పడింది. మీరు కూడా మీ పాఠశాలలో పర్యావరణ రక్షణ కోసం చేసిన కార్యక్రమాల గురించి చిన్నారి పేజీకి రాయండి ఫ్రెండ్స్.
- కె. హాస్య శ్రీ , 10 తరగతి,
అరవింద హై స్కూలు, కుంచనపల్లి,
గుంటూరు జిల్లా.







కామెంట్‌లు (0)