బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉడుత సాయం

1 రోజు క్రితం

ఉడుత సాయం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 04:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

​సుందరమగు అడవియుండె

అందు ఒక్క ఉడుత ఉండె

జీవులకది సాయపడుచు

జీవితమును గడపుచుండె

​

ఒకనాడొక నక్క వచ్చె

ఉడుత సాయమునది మెచ్చె

ఉడుత మిగుల సంబరపడి

దానికి కడు పండ్లనిచ్చె

​

నక్క మిగుల సంతసించె

గృహమ్మునకూ ఏతెంచె

ఆ పండ్లను అది తినుచూ

ఒక కోతినీ బెదిరించె

​

ఆ కోతియు దూకెనాయె

అదీ గాయపడినదాయె

ఆహారము దొరకక అది

ఉడుత కడకు వచ్చెనాయె

​

ఉడుత దాన్ని చూసెనాయె

అదీ పండ్లు వేసెనాయె

ఇంతలోన నక్క వచ్చె

పండ్ల నేరుకొనెనాయె

​

కోతికేమొ దొరకవాయె

ఉడుత పండ్లు ఆపెనాయె

అదీ నక్క గుణము చూసి

దాని తోడ ఇట్లు అనియె

​

‘ఓ నక్కా! నీకు మేలు

చేసితింక చాలు చాలు

నీ గుణము నాకు తెలిసె

పండ్లన్నీ నీదు పాలు

​

ఇకనుండీ నా సాయము

నీకు అందదిక దండము

కోతి ఎంతో గాయ పడి

నా వద్దకు వచ్చె వినుము

​

దాని పండ్లు తీసుకొనుట

ధర్మమేమీ కాదు యిట

నీ కొసగిన చాల పండ్లు

చాలలేదా ఈ పూట

​

కోతి ఎంతో బాధపడియె

ఉడుత ఊరడించెనాయె

ఇంతలోన మృగరాజూ

అక్కడికీ వచ్చెనాయె

​

ఒక చిలుక దాన్ని చూచి

అది ఎంతో సంతసించి

మృగరాజుకు చెప్పెనంత

అది నక్కను అచట గాంచి

​

‘ఓ నక్కా! వెళ్ళుమింక

నా ఆజ్ఞను మీరకింక

గాయపడిన కోతికింక

దక్కనివ్వు పండ్లనింక "

​

అని సింహం చెప్పెనాయె

నక్క మరలిపోయెనాయె

కోతి మిగుల సంతసింప

ఉడుత పండ్ల నిచ్చెనాయె

​

కోతి కడుపు నిండెనాయె

అది ఉడుతను పొగడెనాయె

మృగరాజును సంతసించి

సాయముగని మెచ్చుకొనియె

​

యోగ్యులకును పిల్లలార!

సాయపడిన కూనలార!

లోకమంతా మిము గాంచి

ప్రశంసించు బాలలార!

​- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య, ధర్మపురి

99085 54535.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్