మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘గోరుకల్లు’ గేటు ఎత్తిన ఆగంతకుడు

1 గంట క్రితం

1 pnm - gorukallu .jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 09:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • గ్రామాన్ని ముంచెత్తిన నీరు

  • భయంతో కొండపైకి చేరుకున్న ప్రజలు

  • నిందితుడిపై కఠిన చర్యలు : కలెక్టర్‌

ప్రజాశక్తి – పాణ్యం : నంద్యాల జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి మంగళవారం తెల్లవారుజామున భారీగా నీరు విడుదల కావడంతో గోరుకల్లు గ్రామం వరదలో చిక్కుకుంది. ‌మంగళవారం తెల్లవారుజామున రిజర్వాయర్‌ ఒక గేటును ఆగంతకుడు ఎత్తడంతో ఒక్కసారిగా నీరు వచ్చి పడింది. రిజర్వాయర్‌ ‌గేట్లు తెగిపోయాయని, కాలువకు గండి పడిందన్న వదంతులు వ్యాపించడంతో ప్రాణభయంతో గ్రామస్తులందరూ సమీపంలోని వేణుగోపాలస్వామి ఆలయం కొండపైకి పరుగులు తీశారు.

రిజర్వాయర్‌ ‌నాలుగు గేట్లలో ఒక గేటు తెరుచుకోవడంతో ఎస్‌ఆర్‌‌బిసి కాలువ సామర్థ్యానికి మించి నీరు ప్రవహించడంతో గోరుకల్లు గ్రామంలోని బిసి, ఎస్‌‌సి కాలనీలు, బస్టాండ్‌ ‌పరిసర ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. సమాచారం అందుకున్న ఇరిగేషన్‌ అధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని నీటి ప్రవాహాన్ని అదుపులోకి తెచ్చారు. నీరు తగ్గిపోవడంతో గ్రామస్తులు కొండదిగి తమ ఇళ్లకు చేరుకున్నారు. గోరుకల్లు గ్రామాన్ని జిల్లా కలెక్టర్‌ జి.రాజకుమారి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్ష‍ కార్యదర్శులు ఎ.రాజశేఖర్, టి.రామచంద్రుడు పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. గేట్ల నిర్వహణలో జరిగిన లోపాలపై స్పష్టత ఇవ్వాలని, ఘటనకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని, గ్రామస్తులకు పునరావాస సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. రైతు సంఘం నేతలు మాట్లాడుతూ.. రిజర్వాయర్‌ గేటు ఎలా తెరుచుకుంది? ఎవరి ప్రమేయం ఉందనే దానిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. గేటు ఎత్తిన వ్యక్తిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని, పునరావాసంపై ప్రభుత్వానికి నివేదికలు పంపుతామని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్