రాప్తాడులో ఎన్‌టిఆర్, పరిటాల రవీంద్ర విగ్రహావిష్కరణలో మంత్రి లోకేష్
ప్రజాశక్తి - అనంతపురం ప్రతినిధి : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 94 శాతం కంటే అధిక స్థానాల్లో కూటమి గెలవాలని పార్టీ శ్రేణులకు మంత్రి నారా లోకేష్ సూచించారు. ఉపాధ్యాయుల జోలికొస్తే దబిడి దిబిడేనని వైసిపినుద్దేశించి మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయులపై కోడిగుడ్లతో దాడి చేయడం, వారి పట్ల అసభ్యకరంగా మాట్లాడటమే వైసిపి నేర్చుకున్న విద్యా అని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల జోలికొస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఎన్‌టిఆర్, పరిటాల రవీంద్ర విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంగళవారం ఆయన విచ్చేశారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి లోకేష్ మాట్లాడుతూ... త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్నాయని, కష్టపడి పనిచేయాలంటూ కార్యకర్తలకు కోరారు. రాష్ర్టంలోనే టిడిపి అతి పెద్ద కుటుంబమని, . కోటి ఆరు లక్షల మంది సభ్యులున్నారని, ఆ కుటుంబంలోకి పవన్ కల్యాణ్, బిజెపి చేరిందని పేర్కొన్నారు. మూడు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తాయని తెలిపారు. వెనుకబడిన అనంతపురం జిల్లాలోని సమస్యలను పాదయాత్ర సందర్భంగా కళ్లారా చూశానని, అందుకే ఈ ప్రాంతానికి ఎఎంసిఎ ప్రాజెక్టును అనంతపురం జిల్లాకు తీసుకొచ్చానని చెప్పారు. తిరుగు ప్రయాణంలో ధర్మవరం పట్టణ సమీపంలో ఆగి వున్న ఉన్నత పాఠశాల విద్యార్థులను చూసి కాన్వాయ్ ఆపి వారితో కొంతసేపు ముచ్చటించారు. మధ్యాహ్న భోజనం, చిక్కీ నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎంపి బికె.పార్థసారధి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)