ప్రజాశక్తి - విజయవాడ : దోపిడీలేని.. సమ సమాజ స్థాపన ధ్యేయ సిద్ధాంతవేత్త పేరిట ప్రాంగణం.. మహా శాస్త్ర విజ్ఞానవేత్త జయంతి సందర్భం.. తరతమ భేదం లేని వందలాది విద్యార్థుల ఊహాచిత్ర జ్ఞానావిష్కరణం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్ర (ఎంబివికె) ప్రాంగణం హరివిల్లులా రంగులమయమైంది. జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న జాషువా దశమ సాంస్కృతికోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం ఎంబివికె, బాలోత్సవ భవన్‌లో ‘బాల సంజీవ్ దేవ్’, ‘బాల బాపూల’తో కిక్కిరిశాయి. నాలుగైదు తరగతుల చిన్నారుల నుంచి పిజి విద్యార్థుల వరకు 750 మందిపైగా.. తమ ఊహలకు రెక్కలు తొడిగి కుంచెలతో అందమైన.. అద్భుత చిత్రాలను ఆవిష్కరించారు. భరతజాతి గర్వించదగిన.. తెలుగువారైన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలుగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సృజనాత్మకతతో విజ్ఞానం, ప్రకృతి, సామాజికాంశాలు తదితర దృశ్యాలను మహాద్భుతంగా ఆవిష్కరించారు. వారి ఊహలు రంగులై విరబూసిన దృశ్యంతో ఎంబివికె, బాలోత్సవ భవన్ పండుగ వాతావరణాన్ని మరిపించాయి. ‘ఫోరమ్ ఫర్ ఆర్టిస్ట్స్’ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రముఖ ఆర్ట్ డిజైనర్, ఫోరమ్ ఫర్ ఆర్టిస్ట్స్ నాయకులు గిరిధర్ ప్రారంభిస్తూ బాలలు, యువతలో సజీవ.. ఆరోగ్యకర సృజనాత్మకతను పెంచే ఇలాంటి ఈవెంట్స్ నిర్వహిస్తున్న జాషువా సాంస్కృతిక వేదికను అభినందించారు. రాఘవ, శ్రావణ్ కుమార్, వి.స్వాతి పూర్ణిమ, ‘చిత్రం’ సుధీర్, సంధ్యారాణి తదితర ‘ఫోరమ్’ నాయకులు కార్యక్రమాన్ని పండించారు. జెఎస్‌వి ప్రధాన కార్యదర్శి పి.ఐజాక్ న్యూటన్ పర్యవేక్షించారు.
Print Editionహరివిల్లయి విరిసిన చిత్రలేఖన చైతన్యం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 09:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)