గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

బాధ్యత..

18 గంటల క్రితం

kathaa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 04:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

పార్వతీపురం జమీందారు తన వద్ద పద్దులు వ్రాయడానికి నమ్మకస్తుడైన పనివాడు కావాలని ప్రకటన చేశాడు. పోటీలో పాతిక మంది వరకూ పాల్గొన్నారు. చివరకు రామయ్య, కృష్ణయ్య, భూషయ్య మిగిలారు. వారికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఇచ్చి, బాధ్యతతో మెలిగి ఒకే రకమైన వంటకు కావలసిన సరుకులు తెమ్మని చెప్పాడు. ముగ్గురు ఎవరికి వారు సంతకు బయలుదేరి వెళ్లారు. ముందుగా కృష్ణయ్య వచ్చాడు. రాను పోను రవాణా ఖర్చులు, సరుకుల ఖర్చులు పోనూ పాతిక రూపాయలు మిగిలాయని చెప్పి జమీందారుకు ఇచ్చాడు. కాసేపటికి భూషయ్య వచ్చి అన్ని ఖర్చులు పోనూ యాభై రూపాయలు మిగిలాయని జమీందారుకు ఇచ్చాడు.

చివరగా రామయ్య వచ్చాడు. పెద్దగా దూరం లేని సంతకు వెళ్లేప్పుడు నడుచుకుంటూ వెళ్లి, పేరున్న అంగళ్లలో మంచి సరుకుతో పాటు ధర కూడా తక్కువ ఉన్న వారి వద్ద సరుకులు కొని, వచ్చేప్పుడు గుర్రపు బండిలో వచ్చానని, మొత్తం ఖర్చు ఎనిమిది వందలు అయ్యిందని చెప్పి రెండు వందలు జమీందారుకు తిరిగి ఇచ్చాడు. “నేను మీరు ముగ్గురూ సంతకు వెళ్లేప్పుడు ‘బాధ్యతతో మెలిగి’ అనే పదం వాడాను. అలా బాధ్యతతో మెలిగాడు రామయ్య. బాధ్యతతోనే నమ్మకం ఏర్పడుతుంది కాబట్టి కొలువు అతనికి ఇస్తున్నాను” అని చెప్పాడు జమీందారు.

- యు. విజయశేఖర రెడ్డి, హైదరాబాద్.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్