అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టుపై తేనెటీగలు, ఉడతలు, పక్షులు, ఒక చిన్న పురుగు కలిసి ఆనందంగా జీవించేవి. అయితే చిన్న పురుగు మాత్రం ఎప్పుడూ తనను ఇతరులతో పోల్చుకునేది. పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉంటే, ‘నేను కూడా ఇలా ఎగరగలిగితే ఎంత బాగుండేది!’ అనుకునేది. ఉడతలు ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు చురుకుగా దూకుతుంటే, ‘నేను కూడా ఉడతనైతే బాగుండేది!’ అనేది. తేనెటీగలు తేనె సేకరిస్తూ ఉంటే, ‘నేను కూడా తేనె సేకరించగలిగితే బాగుండేది!’ అని బాధపడేది. ఇలా తనలోని శక్తిని గుర్తించకుండా, ఇతరుల గొప్పతనాన్నే చూస్తూ రోజులు గడిపేది.
ఒక రోజు ఒక వేటగాడు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు. చిన్న పక్షులను, ఉడతలను పట్టుకుని బుట్టలో బంధించాడు. తర్వాత తేనె కోసం తేనెటీగల గూటికి పొగ పెట్టాడు. దాంతో కొన్ని తేనెటీగలు కింద పడిపోయాయి. మరికొన్ని ప్రాణభయంతో తమ గూటిని వదిలి ఎగిరిపోయాయి. ఈ దృశ్యం చూసిన చిన్న పురుగుకు చాలా బాధ కలిగింది. వెంటనే అది వేటగాడి ముక్కు, కళ్లూ, చెవుల దగ్గర తిరుగుతూ అతన్ని ఇబ్బంది పెట్టింది. చివరకు అతని చెవిలోకి దూరి గట్టిగా కుట్టింది. నొప్పిని తట్టుకోలేక వేటగాడు బుట్టను అక్కడే వదిలేసి పరుగెత్తుకుంటూ పారిపోయాడు. పక్షులు, ఉడతలు బయటపడ్డాయి. తేనెటీగలు కూడా తిరిగి తమ గూటికి చేరుకున్నాయి. అవన్నీ చిన్న పురుగు దగ్గరకు వచ్చి, ‘నువ్వు చిన్నదానివైనా, నీ ధైర్యం వల్ల మేమందరం ప్రాణాలతో బయటపడ్డాం. నిజంగా నువ్వే మా హీరో!’ అని కృతజ్ఞతలు తెలిపాయి. అప్పుడు ఆ చిన్న పురుగు తనలోనూ ఒక గొప్ప శక్తి ఉందని తెలుసుకుంది. ఇకపై తనను ఇతరులతో పోల్చుకోకుండా, తన ప్రత్యేకతను గౌరవించాలని నిర్ణయించుకుంది.
నీతి : మనల్ని మనం ఇతరులతో పోల్చుకోకూడదు. ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. సరైన సమయంలో దానిని ధైర్యంగా ఉపయోగిస్తే, మనమూ గొప్పవారమవుతాం.
- కె. ఎం. ఆర్. కుమారి,
కొలంబస్, అమెరికా,
94913 61444.








కామెంట్‌లు (0)