న్యూఢిల్లీ : మూడు భాషల విధానంలో 6వ తరగతికి మినహాయింపునివ్వాలన్న సుప్రీంకోర్టు సూచనపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం మరికొంత సమయం కోరింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అదనపు సమయం కావాలని బుధవారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనాన్ని కోరారు. తగినంత సమయం తీసుకోవాలని, అయితే 6వ తరగతికి ఉపశమనం లభించేలా చూడాలని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి పేర్కొన్నారు. చట్టపరమైన అంశాల ఆధారంగా కాకుండా, 6వ తరగతి విద్యార్థుల సౌకర్యం, వెసులుబాటును పరిగణనలోకి తీసుకుని తాము ఈ సూచన చేశామని అన్నారు. మూడు భాషల విధానానికి మద్దతుగా పాఠశాలల్లో ఉపాధ్యాయుల లభ్యత, అవసరమైన మౌలిక సదుపాయాల వివరాలను అందించాలని సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ కోరారు. ఈ కేసు విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
ప్రస్తుత విద్యా సంవత్సరం ముగియడానికి కేవలం నాలుగు నెలలే మిగిలి ఉన్న తరుణంలో విద్యార్థులపై అకస్మాత్తుగా ఈ విధానాన్ని రుద్దే బదులు, వచ్చే ఏడాది నుండి 6వతరగతిలో అమలు చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ విధానం కోసం విద్యార్థులను ప్రోత్సహించేందుకు అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలను రూపొందించుకునేందుకు ఈ సమయాన్ని వినియోగించుకోవాలని సూచించింది.







కామెంట్‌లు (0)