వినాయక చవితి హడావిడి మొదలైంది. ప్రతి సందులోనూ పెద్ద పెద్ద ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. 10వ తరగతి చదివే అర్జున్ తన స్నేహితులతో కలిసి పెద్ద విగ్రహం కొనడానికి బజారుకెళ్లాడు. అక్కడ 10 అడుగుల ఎత్తైన, బంగారు రంగు కిరీటంతో మెరిసిపోతున్న విగ్రహం అతన్ని ఆకర్షించింది. ‘ఎంత బావుందో! దీన్నే తీసుకుందాం’ అన్నాడు అర్జున్. అదే సమయంలో, అదే బజారు చివరన, ఒక పెద్దాయన చిన్న పాకలో కూర్చుని మట్టితో చిన్న చిన్న గణపతి బొమ్మలు చేస్తున్నాడు. ఆయన పేరు సుబ్బయ్య. ఎవరూ ఆయన దగ్గరికి వెళ్లడం లేదు.
ఈ లోగా అర్జున్ తాతయ్య అక్కడికి వచ్చాడు. తాతయ్య ఆ పెద్ద రంగుల విగ్రహాన్ని చూసి ‘అర్జున్, ఆ పెద్ద విగ్రహం నీటిలో కరగడానికి నెలలు పడుతుంది. దాని రంగులు నీటిని కలుషితం చేసి, చేపలను చంపేస్తాయి. కాబట్టి మట్టి విగ్రహాలు కొనడం చాలా మంచిది’ అంటూ అర్జున్‌ను మట్టి విగ్రహాలు తయారు చేసే సుబ్బయ్య దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక మట్టి విగ్రహాన్ని చేతిలోకి తీసుకుని చూపిస్తూ ‘దీన్ని చూడు. ఇది మన చెరువు మట్టితో చేసింది. దీనికి వేసిన రంగులు కూడా సహజమైనవి - పసుపు, కుంకుమ, మట్టి రంగులే. ఇది నీటిలో వేసిన గంటలోనే కరిగిపోయి, తిరిగి మట్టిలో కలిసిపోతుంది. నీటికి ఎలాంటి హాని చేయదు’ అని చెప్పాడు.
వెంటనే అర్జున్ తన స్నేహితులందరినీ పిలిచాడు. అందరూ కలిసి సుబ్బయ్య తాత దగ్గర 20 చిన్న మట్టి విగ్రహాలు కొన్నారు. వినాయక చవితి రోజు, వారి కాలనీలోని పిల్లలందరూ మట్టి గణపతులనే పూజించారు. నిమజ్జనం రోజు, ఒక పెద్ద తొట్టిలో నీటిని నింపి, విగ్రహాలను అందులోనే నిమజ్జనం చేశారు. ఆ మట్టి నీటిని తమ కాలనీలోని మొక్కలకు పోశారు. తాతయ్య అది చూసి ఎంతో సంతోషించాడు.
- యం. రాం ప్రదీప్,
జెవివి రాష్ట్ర కమిటీ సభ్యులు, తిరువూరు,
94927 12836.








కామెంట్‌లు (0)