ఆగస్టు 15 ఉదయం పాఠశాల మొత్తం రంగురంగుల జెండాలతో సుందరంగా ముస్తాబయింది. తరగతి గదులు, ప్రాంగణం త్రివర్ణ పతాకాలతో రెపరెపలాడాయి. విద్యార్థుల ముఖాల్లో ఆనందం, గుండెల్లో దేశభక్తి ఉప్పొంగింది. ఉపాధ్యాయులు జెండా ఆవిష్కరణ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. పిల్లలు ఒకరితో ఒకరు ఉత్సాహంగా తిరుగుతూ ఉన్నారు. జెండా వందన సమయం ఆసన్నమైంది. ప్రధానోపాధ్యాయులు జెండాను ఆవిష్కరించారు. అందరూ వందనం చేసి జాతీయ గీతం ఆలపించసాగారు. ఆ క్షణం గంభీరంగా, గౌరవంగా సాగుతోంది. ఇంతలో ఆరో తరగతి విద్యార్థి రాము జాతీయ గీతం మధ్యలో సొమ్మసిల్లి పడిపోయాడు. గంట క్రితం జరిగిన మార్చ్‌ఫాస్ట్‌లో పాల్గొనడంతో అలసిపోయాడు. తోటి విద్యార్థులు గమనించినా ఎవరూ కదలలేదు. వారు నిశ్శబ్దంగా నిలబడి జాతీయ గీతం ఆలపించసాగారు.
గీతాలాపన అనంతరం తరగతి ఉపాధ్యాయిని గమనించి రాము దగ్గరకు వచ్చింది. సొమ్మసిల్లిన రామూని మిగతా విద్యార్థుల సహాయంతో పక్కకు తీసుకువెళ్లి బల్లపై పడుకోపెట్టారు. రామూకి గాలి తగిలేలా విద్యార్థులను దూరం జరగమన్నారు. ముఖంపై నీళ్లు చల్లారు. రాము కళ్లు తెరిచి చూశాడు. ఉపాధ్యాయిని తన చేతులతో రాము తల ఎత్తి మంచినీరు తాగించారు. దాంతో మెల్లగా కోలుకున్నాడు. రాము పడిపోయిన విషయం చెప్పకపోవటంపై టీచర్ విద్యార్థులను మందలించారు. నిశ్శబ్దంగా నిలబడటంపై వారిని ప్రశ్నించారు.
“జాతీయ గీతం ఆలాపన సమయంలో కదలకూడదని మీరే చెప్పారు కదా, టీచర్! అందుకే చెప్పలేదు” అన్నారు విద్యార్థులు.
ఉపాధ్యాయిని వారిని ఉద్దేశించి, “దేశం అంటే జెండా ఎగురవేయటం, గీతాలాపన చేయడమే కాదు. ఇతరులకు సాయపడటం కూడా దేశభక్తిలో భాగమే” అన్నారు. “అదే రామూకు ఏదైనా జరిగితే.. ఎవరు సమాధానం చెబుతారు? దేశం బాగుండాలి అంటే మనం బాగుండాలి. మనం బాగుంటేనే దేశం బాగుంటుంది. ఈ విషయం అందరం గుర్తించాలి. దేశభక్తి అంటే వదిలేయటం కాదు. అందరం ఒక్కటిగా నిలిచి రామూను కాపాడుకోవాలి” అని వివరించారు.
ఆ మాటలు వినగానే విద్యార్థుల కళ్లలో కొత్త అర్థం మెరిసింది. వారు నిజమైన దేశభక్తి అంటే కేవలం ఒక క్షణం నిలబడటం కాదు, ప్రతిరోజూ మన చుట్టూ ఉన్నవారిని, ప్రకృతిని, మనల్ని మనం కాపాడుకోవడం అని గ్రహించారు. ఆ రోజు స్వాతంత్ర్య దినోత్సవం వారికి ఒక కొత్త పాఠం నేర్పింది.
- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర,
బీటెక్ మూడో సంవత్సరం (ఈసీఇ),
ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాల, ఖమ్మం.







కామెంట్‌లు (0)