శుక్రవారం, 25 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దెయ్యం నవ్విందా..?

22 గంటల క్రితం

దెయ్యం నవ్విందా..? image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 03:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఒక చిన్న అడవిలో ఒక ఆశ్రమ పాఠశాల ఉంది. అప్పుడప్పుడు రాత్రి వేళల్లో ఆ అడవిలో గుబురుగా ఉన్న చెట్ల మధ్య నుండి ఓ వింత శబ్దం వచ్చేది. "హిహిహిహి... హ్హాహ్హా!" వినడానికి మనిషి నవ్వినట్లే ఉండేది. కానీ చాలా వింతగా, కొత్తగా ఉండేది. ఆ శబ్దం విని ఓ రోజు 10వ తరగతి పిల్లలు సాయంత్రం స్టడీ అవర్స్‌లో భయపడిపోయి... "సార్! దెయ్యం! అడవిలో దెయ్యం నవ్వుతోంది సార్!" అని వణుకుతూ సైన్స్ మాస్టర్ శ్రీను సార్‌తో చెప్పారు. శ్రీను సార్ నవ్వి "రేపు రాత్రి ఆ దెయ్యాన్ని పట్టుకుందాం. టార్చ్ లైట్లు, సెల్ ఫోన్స్ తీసుకుని వెళదాం" అన్నారు.

మరుసటి రోజు రాత్రి 7 గంటలకు సార్, నలుగురు విద్యార్థులు అడవి దగ్గరకు వెళ్లారు. మళ్లీ అదే నవ్వు. "హిహిహిహి..." ఒక విద్యార్థి వణికిపోయాడు. టార్చ్ వేసి చూస్తే - పొదల మధ్య రెండు కళ్ళు మెరుస్తున్నాయి. అది హైనా! చారల హైనా. "ఇదేనా మీ దెయ్యం?" అని శ్రీను సార్ నవ్వుతూ ఆ శబ్దాన్ని ఫోన్లో రికార్డు చేశారు.

మరుసటి రోజు క్లాసులో శ్రీను సార్ రికార్డ్ చేసిన శబ్దాన్ని వినిపించారు. ఆ శబ్దం విని అందరూ భయపడ్డారు. "ఇది దెయ్యం కాదు. ఇది 'చారల హైనా'. దీన్ని ఇంగ్లీష్‌లో లాఫింగ్ హైనా అంటారు. ఎందుకు నవ్వుతుందో తెలుసా?" అని శ్రీను సార్ విద్యార్థులను అడిగాడు. విద్యార్థులు కాసేపు మౌనంగా ఉన్నారు. శ్రీను సారే మరలా కల్పించుకుని అందుకు గల కారణాలను బోర్డు మీద రాశారు.

ఇది నవ్వు కాదు, భాష: 'హైనా నవ్వు' అనేది భయం, ఆందోళన, ఆహారం కోసం ఇతర హైనాలకు సంకేతం. "నాకు ఆహారం దొరికింది, రండి" లేదా "నన్ను వదలండి, నాకు భయంగా ఉంది" అని చెప్పడానికి ఇలా అరుస్తుంది. హైనా నవ్వుతున్నా, దాని దవడ చాలా శక్తివంతమైనది. ఎముకలను కూడా కొరికి తినగలదు. అడవిని శుభ్రం చేసే కార్మికుడు ఇది. హైనా రాత్రిపూటే వేటాడుతుంది. అందుకే రాత్రి దాని అరుపు మనకు దెయ్యం నవ్వులా అనిపిస్తుంది. చీకట్లో మన మెదడు తెలియని శబ్దాన్ని దెయ్యంగా ఊహించుకుంటుంది. సార్ చివరగా అన్నాడు - "మనకు తెలియని ప్రతిదానికి దెయ్యం కారణం కాదు. వాస్తవానికి దెయ్యాలు అనేవి ఉండవు. ఇంకా అవి నవ్వడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది..?" అని చెప్పారు.

ఆ రోజు నుండి ఆ అడవి నుండి నవ్వు వినిపిస్తే, పిల్లలు భయపడటం లేదు. "అదిగో, హైనా అన్న మళ్లీ జోక్ వేస్తున్నాడు!" అని నవ్వుకోవడం మొదలు పెట్టారు పిల్లలు.


- యం. రాం ప్రదీప్, జెవివి రాష్ట్ర కమిటీ సభ్యులు

94927 12836

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్