ఒక ఆశ్రమంలో ఒక సాధువు, కొంతమంది శిష్యులు ఉండేవారు. ఆశ్రమంలోని చెట్లపైన కొన్ని రకాల పక్షులు, చెట్ల కింద జింక, కుక్క ఉండేవి. సాధువు వాటన్నింటినీ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఒక రోజు చిలుకలు, కోకిలలు, జింక సాధువుతో సమావేశమై, “అయ్యా! మాలో ఎవరు గొప్పనో చెప్పాలి” అని అన్నాయి. “మావి చిలుక పలుకులు అని అందరూ మెచ్చుకుంటారు” అన్నాయి చిలుకలు. “మేము చక్కగా కూస్తాము” అన్నాయి కోకిలలు. “నా కన్నా అంత అందంగా ఏ జంతువూ ఉండదు” అంది జింక. కాకులు, కుక్క ఏమీ మాట్లాడలేదు.
“ఎవరు గొప్పనో కొంత సమయం తరువాత చెబుతాను” అని సాధువు చెప్పాడు. పక్షులను, చిలుక, కోకిల, కాకితో పాటు జింక, కుక్కను రమ్మని పిలిచి, శిష్యులతో అరిటాకులో ఎలాంటి ఆహారం ఏర్పాటు చేయాలో చెప్పాడు సాధువు. జింకకు ఆకులతో పాటు కొన్ని దుంపలు, చిలుకకు జామపండు ముక్కలు, కోకిలకు మామిడి చిగుళ్లు, కాకికి అన్నం ముద్ద, కుక్కకు పెరుగన్నం పెట్టించాడు. కాకి, కుక్క అరిటాకుల బయట ఒక్క మెతుకు కూడా పడకుండా శుభ్రంగా తిన్నాయి. జింక, చిలుక, కోకిల తమ ఆహారాన్ని అరిటాకుల చుట్టూ చిందరవందరగా చేసి తిన్నాయి. “పక్షులలో కాకులు, జంతువులలో కుక్క గొప్పవి” అని చెప్పాడు సాధువు. మిగతా పక్షులు గానీ, జింక గానీ ఏమీ మాట్లాడలేక, “అయ్యా! మీ మాటలను గౌరవిస్తున్నాము” అని అన్నాయి.
- యు. విజయశేఖర రెడ్డి, హైదరాబాద్.








కామెంట్‌లు (0)