ఒక చిట్టడవిలో కోతి, నక్క స్నేహంగా ఉండేవి. కోతి అడవిలో జంతువులకు ఎప్పుడూ సాయం చేస్తూ చక్కని గౌరవం పొందేది. నక్క కూడా ఇతర జంతువులకు సాయం చేసేది. కానీ సాయానికి ప్రతిఫలంగా ఆయా జంతువుల నుంచి ఏదో ఒకటి తీసుకునేది. కోతి అది గమనించి ‘మిత్రమా! సాయం పేరుతో వారి దగ్గర నుంచి ఏదైనా ఆశించడం సరికాదు’ అని చెప్పేది. కానీ నక్క ‘నీకేమీ తెలియదు. మన దగ్గర సాయం పొందాలంటే, వాళ్ల నుంచి కూడా మనం ఎంతో కొంత ప్రతిఫలం అందుకోవాలి’ అనేది.
ఒకరోజు నక్క ఉదయమే నిద్ర లేచి వేటకు బయలుదేరింది. దారిలో దానికి ఒక కుందేలు కనిపించింది. దాన్ని పట్టుకుందామని పరుగుపెట్టింది. కానీ కుందేలును పట్టుకోకముందే ఒక లోతైన గోతిలో నక్క పడిపోయింది. ‘రక్షించండి... రక్షించండి...’ అని కేకలు వేసింది. ఆ దారిన వెళ్లే ఒక ఎలుగుబంటి ఆ కేకలు విని గోతి దగ్గరకు వచ్చింది. నక్క బతిమాలుతూ ‘ఎలుగుబంటి అన్నా! నన్ను కాపాడు’ అంది. అప్పుడు ఎలుగుబంటి నవ్వుతూ ‘నిన్ను రక్షిస్తే నాకేమిస్తావ్? రోజూ నాకు ఒక కోడి తెచ్చి ఇస్తావా? లేక తేనె తెచ్చి ఇస్తావా?’ అని అడిగింది. నక్కకు నోట మాట రాలేదు. అది ఇన్నాళ్లు అందరినీ అడిగిన ప్రశ్నే ఇప్పుడు తనను ఎలుగుబంటి అడిగింది. నక్క ఏడుస్తూ ‘నా దగ్గర ఏమీ లేదు, దయచేసి కాపాడు’ అంది. ‘ఏమీ ఇవ్వనప్పుడు నేనెందుకు కాపాడాలి?’ అని ఎలుగుబంటి అక్కడ నుండి వెళ్లిపోయింది. తరువాత ఒక జింక వచ్చింది. అది కూడా అలాగే ‘నాకు ఏమిస్తావు?’ అని అడిగి వెళ్లిపోయింది.
నక్కకు తన తప్పు అర్థమైంది. అప్పుడే ఆ దారిలో దాని మిత్రుడు కోతి వచ్చింది. గోతిలో ఉన్న నక్కను చూసి వెంటనే ఏనుగును పిలుచుకొని వచ్చింది. ఏనుగు తన తొండంతో నక్కను పైకి లాగింది. పైకి వచ్చిన నక్క సిగ్గుతో తల దించుకుని ఏనుగుకు, కోతికి కృతజ్ఞతలు చెప్పింది. ‘మిత్రమా, నువ్వు పిలవగానే ఏనుగు వచ్చి నన్ను కాపాడింది. కానీ నేను కష్టంలో ఉన్నప్పుడు ఎవరూ నన్ను కాపాడలేదు. నువ్వు ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయడం వల్లే అడవిలో అందరికీ నీపై గౌరవం ఉంది. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది’ అంది. అప్పటినుంచి నక్క కూడా ప్రతిఫలం ఆశించకుండా అందరికీ సాయం చేయడం మొదలుపెట్టింది.
- మొర్రి గోపి,
కవిటి, శ్రీకాకుళం జిల్లా,
88978 82202.







కామెంట్‌లు (0)