ఊరికి దగ్గరగా ఉన్న చెరువు గట్టు దగ్గర చీకటి పడగానే ప్రతి రోజూ వందలాది చిన్న చిన్న దీపాలు ఒక్కసారిగా వెలిగి, ఆరి, మళ్లీ వెలిగేవి. ఆదివారం కావడంతో గ్రామంలోని 6వ తరగతి పిల్లలు రవి, సీత, అర్జున్ ఆడుకుంటూ అటు వెళ్లారు. అప్పటికే చీకటి పడిపోయింది. పిల్లలు ముగ్గురూ చీకట్లో ఆ వెలుగులు చూసి ఉలిక్కిపడ్డారు. ‘అయ్యో! అక్కడ చూడండి! దెయ్యాలు మంట వేసుకుని చలి కాగుతున్నాయి!’ అన్నాడు రవి వణుకుతూ. ‘అవును! ఎగురుతున్న మంటలు! నాకూ భయంగా ఉంది. ఇంటికి పదండి!’ అంది పెద్ద పెద్ద కళ్లు చేసుకుని సీత. ‘అమ్మో! ఎవరికీ చెప్పొద్దు. దెయ్యం మనల్ని పట్టుకుంటుంది!’ అన్నాడు వెనక్కి తిరిగి చూడకుండా ఉరుకుతూ అర్జున్. ముగ్గురూ భయంతో ఇంటికి పరిగెత్తి, మరుసటి రోజు స్కూల్లో టీచర్‌కి చెప్పారు. సైన్స్ పీరియడ్‌లో మాస్టారు సురేష్ గారు క్లాస్‌లోకి వచ్చి రావడంతోనే ‘ఏంట్రా, నిన్న రాత్రి చెరువు గట్టు దగ్గర దెయ్యాలు మంట కాగాయంట కదా?’ అని నవ్వుతూ అడిగారు. పిల్లలందరూ ఒక్కసారిగా రవి, సీత, అర్జున్ వైపు చూశారు. వాళ్ల ముఖాలు ఎర్రబడ్డాయి.
మాస్టారు బ్లాక్ బోర్డు దగ్గరికి వెళ్లి ఒక చిన్న పురుగు బొమ్మ గీశారు. మాస్టారు ఏం చెబుతున్నారో పిల్లలకు అర్థం కాలేదు. పిల్లల వైపు తిరిగిన మాస్టారు ‘పిల్లలూ, అవి దెయ్యాలు కావు. మిణుగురు పురుగులు’ అని చెప్పారు. ‘పురుగులా సార్? అవి ఎందుకు వెలుగుతాయి?’ అని రవి అనుమానంగా అడిగాడు. ‘రవి ఒక్కడే కాదు, మీరు కూడా దీనికి సమాధానం శ్రద్ధగా వినండి’ అని మాస్టారు పిల్లలతో ఇలా చెప్పారు. ‘ఈ పురుగుల శరీరంలో ‘లూసిఫెరిన్’ అనే ఒక రసాయనం ఉంటుంది. ఆక్సిజన్ తగిలినప్పుడు అది వెలుగుగా మారుతుంది. దీన్ని ‘జీవ ప్రకాశం’ అంటాం’ అని చెప్పారు. ‘అంటే అవి కరెంట్ లేకుండా వెలుగుతాయా సార్?’ అంది సీత ఆశ్చర్యంగా! ‘అవును తల్లి. ప్రకృతి ఇచ్చిన టార్చ్ లైట్ అది. మగ పురుగులు ఆడ పురుగులను ఆకర్షించడానికి ఇలా మెరుస్తాయి’ అని చెప్పారు. ‘ఇక నుంచి మీరు ఎప్పుడూ దెయ్యం, భూతం అన్న మాటలు నమ్మకండి. వాటి చుట్టూ ఉన్న భయం వెనుక సైన్స్ ఉంటుంది. కాబట్టి భయపడే బదులు ప్రశ్నించడం నేర్చుకోండి’ అని చెప్పారు. ఆ రాత్రి మళ్లీ పిల్లలు ముగ్గురూ చెరువు గట్టుకు వెళ్లారు. కానీ ఈసారి భయంతో కాదు. చేతిలో ఖాళీ సీసా, నోట్‌బుక్‌తో.
ఆ రోజు కూడా మిణుగురులు వచ్చాయి. వాటిని చూడడంతోనే పిల్లలు ఆనందంతో కేరింతలు కొట్టారు. ‘హే ఇవి దెయ్యాలు కాదు. మన స్నేహితులు. ప్రకృతి దీపాలు!’ అనుకుంటూ నోట్‌బుక్‌లో రాసుకున్నారు. అర్జున్ కొన్ని మిణుగురులను సీసాలో నింపుకున్నాడు. అప్పటి నుంచి ఆ ముగ్గురూ జూనియర్ సైంటిస్టులు అయ్యారు. ఊళ్లో ఎవరైనా దెయ్యం అంటే.. కాదు, అది సైన్స్ అని చెబుతున్నారు.
నీతి : అజ్ఞానం చీకటిలాంటిది. జ్ఞానం మిణుగురు పురుగులాంటిది. చిన్న వెలుగు కూడా పెద్ద చీకటిని పారద్రోలగలదు.
- యం. రాం ప్రదీప్,
జెవివి సభ్యులు, తిరువూరు,
94927 12836.







కామెంట్‌లు (0)