ఆదివాసీలకు రక్షణ కవచంగా వున్న 1/70 చట్టం వలన గిరిజనులకు మేలు జరగదని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న భూములన్నీ మార్కెట్‌లో పెట్టి భూములను క్రయవిక్రయాలు చేయగలిగితే గిరిజనుల జీవితాల్లో మార్పు వస్తుందని, 55 సంవత్సరాల తరువాత ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని భారతీయ కిసాన్ సంఘ్ కార్యదర్శి మందనపు రామారావు ఆంధ్రజ్యోతి దినపత్రికలో సెప్టెంబర్ 2న వ్యాసం రాశారు. ఈ వ్యాసం గిరిజన ప్రాంతంలోని చట్టాలను బలహీనపర్చి ఏజెన్సీ సహజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడ్పడేలా వుంది.
భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ గిరిజనులకు అనేక రక్షణ అంశాలను పేర్కొంది. అందులో భాగంగానే ఏజెన్సీ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేయాలని నిర్దేశించింది. రాష్ట్రపతి, గవర్నర్ల ఆమోదంతోనే ఆ ప్రాంతంలో చట్టాలు అమలు చేయాలి. ఆదివాసీల భూములను రక్షించడం కోసం 1959లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దీనికి ప్రధాన కారణం తమ అస్తిత్వం కోసం బ్రిటీష్ కాలం నుండి గిరిజనులు చేస్తున్న అనేక పోరాటాలు. ఆ నేపథ్యంలోనే భూ రక్షణ చట్టాలు వచ్చాయి. ఈ చట్టాలు... తీవ్ర పేదరికంలో వున్న గిరిజన కుటుంబాలకు అప్పులు ఇచ్చిన వడ్డీ వ్యాపారులు, మధ్యవర్తుల చేతుల్లోకి వారి జీవనాధారంగా వున్న భూములు వెళ్లకుండా కాపాడాయి. గిరిజన ప్రాంతంలోని సంస్కృతి, సాంప్రదాయాలను రక్షించాయి. భూమికి రక్షణ మాత్రమే సరిపోదు. ప్రభుత్వం సాగు నీరు, పెట్టుబడి, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు, రుణాలు వంటి సౌకర్యాలు కల్పించగలిగితే ఏ రైతు ఏ సందర్భంలోను భూములను అమ్ముకోడు. కాని, ఏజెన్సీ ప్రాంతంలో భూముల కొనుగోలు, అమ్మకాలు జరిగితేనే వారి జీవితాల్లో మార్పులు వస్తాయన్నట్లుగా రచయిత (మందనపు రామారావు) అభిప్రాయాలు తెలియజేశారు. మైదాన ప్రాంతంలో కంపెనీల కోసం భూ సేకరణ చేస్తున్న ప్రాంతాల, రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములు కొనుగోలు చేస్తున్న ప్రాంతాల రైతుల పరిస్థితి ఏమిటో రచయితకు అర్ధం కావాలి. ఈ ప్రాంతాల్లో భూములు అమ్ముకుంటున్న సన్న, చిన్నకారు రైతులు ఆకలి చావులకు గురవుతున్న, ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు మన కళ్ల ముందే కనిపిస్తున్నాయి. ఆదివాసీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని రద్దు చేస్తే ఆదివాసీల ఆకలి చావులు, ఆత్మహత్యలకు గురికావాల్సి వస్తుంది. ఆదివాసీ అస్తిత్వానికే పెను ప్రమాదం వాటిల్లుతుంది.
ఆదివాసీ ప్రాంతంలో గిరిజనులకు అప్పులిచ్చి అధిక వడ్డీ వసూలు చేశారు. అప్పు తీర్చని ఎడల గిరిజనుల భూములను బలవంతంగా రాసుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున గిరిజనుల్లో అసంతృప్తి వచ్చి ఉద్యమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే భూ రక్షణ చట్టాలు వచ్చాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనంతగిరి మండలం బొర్రా రిజర్వు ఫారెస్టు, పరిసర 14 గ్రామాల్లో ఎం.ఎస్ ఫెర్క్‌లెస్ ఇండియా లిమిటెడ్, యునిరక్ మినరల్ ప్రైవేట్ లిమిటెడ్, కల్యాణి మినరల్స్ గిరిజన ప్రాంతంలో మైనింగ్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీనిపై సమతా స్వచ్ఛంద సంస్థ 1959 ఏజెన్సీ భూ పరిరక్షణ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. 1959 భూ పరిరక్షణ చట్టాన్ని మరింత పటిష్టం చేస్తూ 1/70 చట్టం వచ్చింది. ప్రభుత్వం కూడా ఆదివాసీ ప్రాంత భూములకు రక్షణగా వుండాలి తప్ప ప్రైవేట్ సంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు భూములు కేటాయించడానికి వీల్లేదు. భూ బదలాయింపు నిషేధ చట్టంతో గిరిజనుల జీవితాలకు భరోసా ఏర్పడింది. భూమిని అమ్ముకోకుండా కాపాడడం, ఆ భూమిపై గౌరవంగా జీవించే పరిస్థితి నెలకొన్నది. దీనిని ఓర్వలేని గిరిజనేతర పెత్తందార్లు అనేక సందర్భాల్లో దాడి చేస్తూనే వున్నారు. పాలక వర్గాలు కూడా గిరిజనేతర బడాబాబులకు అన్ని రకాల సహాయ, సహకారాలు ఇస్తున్నాయి. ఇటీవల కాలంలో యర్రంశెట్టి సత్యనారాయణ, మరో 1672 మంది గిరిజనేతరులు 1/70 సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేసు నమోదు చేశారు. యర్రంశెట్టి సత్యనారాయణ ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టులో 1/70 చట్టాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు గిరిజనుల పక్షాన తీర్పును ఇచ్చింది. దీనిపై సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు. ప్రభుత్వం నేటికీ కూడా 1/70 చట్టంపై సుప్రీంకోర్టులో గిరిజనుల తరఫున పిల్ వేయకుండా తాత్సారం చేస్తున్నది.
నేడు భారతీయ కిసాన్ సంఘ్ కార్యదర్శి మందనపు రామారావు 1/70 చట్టాన్ని ఎత్తివేసి గిరిజనేతరులకు, కార్పొరేట్ శక్తులకు భూములను అప్పగించి గిరిజనులను భూముల నుండి గెంటివేసేందకు కుట్రలు పన్నుతున్నారు. ఏజెన్సీకి ఆనుకొని వున్న నాన్‌షెడ్యూల్ ఏరియాలో ఉన్న గిరిజనులకు భద్రత లేదు. వారు సాగు చేసుకుంటున్న భూములను పెత్తందారులు భూ రికార్డులు మార్చి భూ కబ్జాలకు పాల్పడుతున్నారు.
కేంద్ర బిజెపి ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న బాక్సైట్, లేటరైట్ వంటి ఖనిజ సంపదలను, భూములను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతున్నది. ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి బిజెపి పాలిత రాష్ట్రాల్లో 530 ప్రధాన ఖనిజాల మైనింగ్ లీజులు, 86,130 హెక్టార్లు విస్తీర్ణంలో తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. మన రాష్ట్రంలో పాడేరు, చింతపల్లి, అరకు, అనంతగిరి ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాల కోసం కుట్రలు పన్నుతున్నారు. ఇటీవల కాలంలో చింతపల్లి, హుకుంపేట, అరకు, అనంతగిరి ప్రాంతాల్లో నవయుగ, అదానీ కంపెనీలకు పంప్డ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ కోసం దొడ్డిదారిన జీవోలు మంజూరు చేశారు. దీనిపై గిరిజనులు తీవ్రమైన పోరాటాలు నిర్వహిస్తున్నారు.
జీవో నెం.3 రద్దుతో ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు 100 శాతం ఉద్యోగాల హక్కు దూరమైంది. అటవీ హక్కుల చట్టం అమలు నీరుగార్చడం, ఉపాధి హామీని నిర్వీర్యం చేయడం, గిరిజన సహకార సంస్థను బలహీనపరచడం, గిరిజన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వకపోవడం, పి.వి.టి.జి లకు అందే ఆహార భద్రతను కుదించడం, పోలవరం నిర్వాసితులకు నేటికీ పూర్తిస్థాయి పునరావాసం, పరిహారం అందించకపోవడం వంటి సమస్యలను పరిష్కరించకుండా గిరిజనుల భూములు అమ్ముకుంటేనే అభివృద్ధి వస్తుందని చెప్పడం గిరిజనులను బికారులుగా చేసే కుట్ర. ఇది అభివృద్ధి పేరుతో గిరిజనుల భూములు, అడవులు, ఖనిజాలు, సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రమాదకరమైన వాదన. గిరిజనుల భూములను మార్కెట్ సరుకుగా మార్చడం కాదు. వారి హక్కులను కాపాడటం, చట్టాలను అమలు చేయడం, ఉపాధి, జీవనాధారాలను బలోపేతం చేయడం, ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక అమలు చేయడమే నిజమైన గిరిజన అభివృద్ధి.
- వ్యాసకర్త: కె. లోకనాధం
ఎ.పి వ్యవసాయ కార్మిక సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,సెల్ : 9490098791







కామెంట్‌లు (0)