శుక్రవారం, 11 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కావలెను!

1 గంట క్రితం

satire
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 04:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

"ఇంకా, పేరు లేని ( పే.లే ) పార్టీకి అర్జెంటుగా కేడర్, లీడర్లు కావలెను. సభ్యత్వం పూర్తిగా ఉచితం. ఓటర్లు మాత్రమే అర్హులు. పార్టీ కార్యకలాపాలన్నీ సో.మీ లోనే జరుగుతాయి "

" సో.మీ ఏంట్రా!"- ఆసక్తిగా వింటున్న నాయుడు, పంటి కింద రాయిలా పడిన ఆ మాటకు చిరాకు పడ్డాడు.

" సోషల్ మీడియా అనే మాటని అలవాటు చెయ్యడానికి అలా కుదించి పెట్టుకున్నారు "- పేపర్ చదవడం ఆపి, అభిప్రాయపడ్డాడు పరదేశి.

" సర్లే.. మిగిలింది చదువ్"

"ఆ.. జరుగుతాయి. మైనర్లను మా సో.మీకి దూరంగా ఉంచి, వారి భవిష్యత్తులను కాపాడుకునే బాధ్యత తల్లిదండ్రులు లేదా సంరక్షకులదే! లీగల్ లావాదేవీలకు తావు లేదు."

" పార్టీ పేరు ప్రకటించకుండా, ఇదేట్రా ఈ ప్రకటన!"- విసుగ్గా, చుట్ట ముట్టించాడు నాయుడు.

" ఇంకా, బోలెడు ముస్తాబు ఉన్నట్టుంది విను.. వివరాలు 14వ పేజీలో..( పేపర్ తిరగేసి ) ఇంతవరకూ అవకాశానికి నోచుకోలేని కుల, మతాల వారికి ప్రధాని, ముఖ్యమంత్రి పదవులు రిజర్వు చేయడమైనది. జెన్ జీ తరాన్ని దృష్టిలో ఉంచుకుని 70 శాతం పార్టీ టికెట్లు, వారికే కేటాయింపు...ఉద్యమాల జోలికి వెళ్లకుండానే కార్యకలాపాలు... కాబట్టి, హై బి.పి, షుగర్ పేషెంట్లతో పాటు, స్టంటులు, బైపాస్ వారు కూడా ఇసుమంతైనా ఇబ్బంది లేకుండా, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వెసులుబాటు"

" ఇదేదో బాగుందిరా! ఇంతకీ..టిక్కిటిచ్చి..ఫండిస్తారా...” అంటూ, కాల్చుతున్న చుట్టను యాష్ ట్రే లో పెట్టి, అడిగాడు నాయుడు.

" పూర్తిగా సదవనీ.. రాద్ధాంతములు లేని సిద్ధాంతములను అమలుపరచబడును. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను, తీసుకున్న నిర్ణయాలను, ఇచ్చిన జి.ఒ లను, కేటాయింపులను పే.లే. పార్టీ వ్యతిరేకించదు"

" ఇదేమి దిక్కుమాలిన పార్టీ రా!.. ఎగిరే పిట్టకు మసాలా నూరడమంటే ఇదే!"- కుర్చీలో చేరబడి, మళ్లీ చుట్ట ముట్టించుకున్నాడు నాయుడు.

పరదేశి పేపర్ పక్కన పడేసి, దీర్ఘంగా ఆలోచించడం మొదలెట్టాడు.

" జె.పి, జె.డి లాంటి వాళ్లే జెండాలు మడతెట్టేసి, జైహింద్ కొట్టేశారు. ఈళ్ల బతుకెంత! ప్రెతీవోడికీ పోలిటిక్సంటే సులకనైపోయింది "- నాయుడికి బాగా చిరాకొచ్చింది.

దీర్ఘాలోచన నుంచి బయటపడి--

" అలాగనీకన్నా! ఈ ప్రెకటన ఇచ్చినోడు, గట్టి మతలబ్ మేనే అయింటాడు.. గుజరాత్ లో కొన్ని అనామతు ( అనామక )పార్టీల ఎకౌంట్లలోకి భూరి విరాళాలు ఆటంతట అవే వొచ్చీసి, పడిపోనాయట! ఇలాటి జిమ్మిక్కులు తెలిసినోడే, ఇలాటి ప్రెకటన ఇచ్చి వుంటాడని కచ్చితంగా నా నమ్మకం".

ఈమధ్య రిజిస్ట్రేషన్, ఎలక్షన్ కమిషన్ గుర్తింపులేని గుజరాత్ లోని కొన్ని పార్టీలకు దాదాపు 1700 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినట్టు ఏదో పేపర్ లో చదివిన వార్త పరదేశికి గుర్తొచ్చింది.

" అద్సరే! నమ్మించడానికైనా కనీసం ఒక జెండా, దానికో రంగూ, గుర్తూ ప్రెకటించాలి గదా!"

" వార్త.. పూర్తిగా సదవలేదు.. ఆగు ( పేపర్ అందుకొని ) ఆ..చేశాడన్నో! ఏటంటే.. జెండా పూర్తిగా తెలుపు రంగులో ఉంటుంది. అంచులు మాత్రం కాషాయ రంగులో ఉంటాయి. పార్టీ గుర్తుని ఓటర్ల అభిప్రాయం మేరకు ఎంపిక చేయడం జరుగుతుంది. సరైన గుర్తు సూచించిన వారికి తగిన బహుమతి.. ఒకే దాన్ని ఎక్కువ మంది సూచిస్తే లాటరీ ద్వారా ఒకరి పేరు ఎంపిక చేసి వారు ఊహించని బహుమతి అందజేస్తాము "

" నీ అదృష్టమో, ఆళ్ల దురదృష్టమో! నువ్వూ ఒక గుర్తు పంపించెయ్"- నవ్వుతూ, పైకిలేచి పంచె సర్దుకున్నాడు నాయుడు.

ఏదో, చీకట్లోకి రాయి విసురుదామన్న సరదాతో, పరదేశి కూడా పైకి లేస్తూ, అడిగాడు. ఇంతలో ఎక్కడి నుంచో, ఒక అరుపు --

" ఏట్రా అదీ?"

" నక్క "

" అదే పంపించు "


- ' నల్లి ' కుట్టు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్