‘నాకు ఇక బతకాలని లేదు...’ ఒకరి నోట ఈ మాట వినిపించినప్పుడు మనకు ఒక్కసారిగా భయం వేస్తుంది. ఏం జరిగిందో తెలుసుకోవాలనిపిస్తుంది. కొందరైతే వెంటనే ధైర్యం చెప్పడం మొదలుపెడతారు. ‘అలా అనుకోకు... జీవితం చాలా విలువైనది’ అంటారు. మరికొందరు ‘నీకు ఏమంత కష్టం వచ్చింది?’ అంటూ ప్రశ్నిస్తారు. ఇంకొందరు ‘ఇవన్నీ చిన్న సమస్యలే... పాజిటివ్‌గా ఆలోచించు’ అని సలహా ఇస్తారు. కానీ ఆ సమయంలో ఆ వ్యక్తికి కావాల్సింది ఇవేవీ కాకపోవచ్చు. వాళ్లకు కావాల్సింది తన మాటను పూర్తిగా వినే ఒక మనిషి. ఢిల్లీ నోయిడాకు చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ అనునా బోర్డొలోయి తన వృత్తి అనుభవంలో ఇలాంటి ఎన్నో సందర్భాలను చూశారు. వాటన్నింటినీ అధ్యయనం చేసిన ఆమె అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులతో ఎలా మసలుకోవాలో చెబుతున్నారు.
‘నాకు బతకాలని లేదు’ అన్నప్పుడు.. ఆ మాట వెనుక చావు కోరిక ఉండకపోవచ్చు. భరించలేని బాధ నుంచి బయటపడాలనే తపన ఉండొచ్చు!’ అంటున్న అను దగ్గరకు కౌన్సిలింగ్ కోసం ఒకసారి 22 ఏళ్ల యువకుడు వచ్చాడు. ‘అతని మాటల్లో ఎంతో నిస్సహాయత కనిపించింది. చాలా కాలంగా తనలో తాను మోస్తున్న బాధ అంతా అతనితో మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా తెలిసింది. ‘నాకు చావాలని ఉంది’ అంటున్నారు అంటే.. ఆ వ్యక్తి నిజంగానే జీవితాన్ని ముగించుకోవాలనుకుంటున్నాడా? లేక తనను పట్టిపీడిస్తున్న బాధ నుంచి బయటపడాలనుకుంటున్నాడా? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం’. ఈ రెండింటికీ మధ్య చాలా తేడా ఉంటుంది. ఒక సమస్య నుంచి బయటపడే మార్గం కనిపించనప్పుడు, బాధ ఎప్పటికీ ఇలాగే ఉంటుందని అనిపించినప్పుడు ఆ బాధకు ముగింపు కావాలని కోరుకుంటారు. ఆ ముగింపు జీవితానికి ముడిపెట్టి దాన్ని అంతం చేయాలనుకునే భావనే ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది. తాను ఎదుర్కొంటున్న పరిస్థితిని మార్చుకునే శక్తి తనకు లేదనిపిస్తుంది. అలాంటి సమయంలో ‘జీవితం చాలా అందమైనది’ అని చెప్పడం కన్నా.. ‘అసలు ఏం జరిగింది?’ అని అడిగి అతని బాధను వినాలి.
బాధ కనిపించదు
మానసిక కుంగుబాటు ఎప్పుడూ బయటికి కనిపించదు. రోజూ మామూలుగా ఆఫీసుకు వెళ్లే వాళ్లు, స్నేహితులతో నవ్వుతూ మాట్లాడే వారు, సోషల్ మీడియాలో చురుకుగా కనిపించే వాళ్లు, కుటుంబంతో సాధారణంగా ఉండే వాళ్లు, ఎవరిలోనైనా కుంగుబాటు ఆలోచనలు బయటకు కనిపించవు. అయితే కొన్ని సందర్భాల్లో పరోక్షంగా వాళ్లు చెప్పే మాటల్లో ఆ బాధ బయటపడుతుంటుంది. ఆ మాటలను సరదాగా తీసుకోవద్దు. ‘అటెన్షన్ కోసం చెబుతున్నారు’ అనుకోవద్దు. తనకు తెలియకుండానే తన బాధను మాటల్లో బయటపెట్టేస్తుంటే.. ఆ క్షణంలో వాళ్లకు మన సహాయం చాలా అవసరం అని భావించాలి.
ఇలాంటి వ్యక్తులు మనకు తారసపడితే.. ‘పాజిటివ్‌గా ఆలోచించు’.. అని చెప్పే మాటలు మనకు తెలియకుండానే వాళ్లను మరింత ఒంటరిగా మార్చేస్తాయి. ఉద్దేశంలో ఆ మాటలు మంచివే కావచ్చు. కానీ తీవ్ర మానసిక బాధలో ఉన్న వ్యక్తికి మాత్రం తన బాధను ఎవరూ అర్థం చేసుకోవడం లేదనే భావనను కలిగిస్తాయి. అప్పుడేం చేయాలి? ఆ వ్యక్తి చెబుతున్న బాధను ఓపిగ్గా వినాలి. అప్పుడు వాళ్ల మనసు కొంచెం తేలిక పడుతుంది. తనను ఎవరైనా అర్థం చేసుకుంటున్నారనే భావన వస్తుంది. ఇలాంటప్పుడు చాలామంది ‘ఆత్మహత్య గురించి అడిగితే.. లేనిపోని ఆలోచనలు ఇచ్చినట్లు’ అని భావిస్తారు. అయితే అది తప్పు. ప్రముఖ మానసిక ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ‘వ్యక్తి తీవ్రమైన బాధలో ఉన్నట్లు అనిపిస్తే, అతని ఆలోచనల గురించి ప్రశాంతంగా అడగడం అవసరం. అతని మాటలను భయంతో ఆపేయడం కాదు.. అతను చెప్పేదాన్ని వినాలి. ప్రశ్నలతో ముంచెత్తడం, తీర్పు చెప్పడం, కోపగించుకోవడం కాదు. అతని భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ సంభాషణల్లో ఆ వ్యక్తి తనకు తానే హాని చేసుకునే ప్రమాదంలో ఉన్నట్లు అనిపిస్తే అతన్ని ఒంటరిగా వదిలేయకూడదు. నమ్మకమైన కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ఎప్పుడూ తనతో ఉండాలి. అవసరమైతే తక్షణం మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి.
అప్పుడేం చేయాలి?
ఒక మనిషిని కాపాడేందుకు పెద్ద పెద్ద ఉపన్యాసాలు, సహాయాలు చెయ్యక్కర్లేదు. మన పక్కన కూర్చొన్న వ్యక్తి తన బాధను చెప్పుకుంటున్నప్పుడు.. ఫోన్ పక్కన పెట్టి అతని వైపు చూడటం కూడా సహాయమే. మధ్యలో మాట ఆపకుండా వినడం, ‘నీ బాధ నిజమే’ అని చెప్పడం.. వంటి చిన్న చిన్న పనులు అతనికి తన బాధను ఎవరో ఒకరు పట్టించుకుంటున్నారు అన్న భావనను కలిగిస్తాయి. ఉద్యోగం లేక, ప్రేమ విఫలమై, కుటుంబ సమస్యలు, చదువు, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం, అనారోగ్యం కారణం ఏదైనా బాధలో ఉన్న వ్యక్తికి ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా మారిపోయినట్లు అనిపిస్తుంది. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్లు చెప్పే ఒక్క మాట, చూపించే ఆప్యాయత.. అతని కోసం వెచ్చించే కొద్దిపాటి సమయం ఎంతో విలువైనదిగా మారుతుంది’ అని అను చెబుతున్నారు. ఇక్కడ అతను అంటే అతడే కాదు, అమె అని కూడా. అనునా అభిప్రాయం ప్రకారం, ఆత్మహత్యా ఆలోచనలను కేవలం ఒక వ్యాధిగా చూడటం కంటే ఒక మనిషి అనుభవిస్తున్న తీవ్ర బాధగా చూడాలి. చాలాసార్లు వ్యక్తి కోరుకునేది నిజంగా జీవితాన్ని ముగించడం కాదు. తన బాధను ముగించడం. కాబట్టి ఆ సమయంలో ఒక చిన్న సంభాషణ, చిన్న భరోసా ఆ ఆలోచనను మారుస్తుంది. జీవించాలన్న ఆశను కలిగిస్తుంది.







కామెంట్‌లు (0)