‘ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం’గా పేరుపొందిన కృష్ణా డెల్టా నేడు తీవ్రమైన సాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో “ఈ సీజన్‌లో వరి పంట వేయవద్దు” అని ప్రభుత్వం జారీ చేసే సూచనలు డెల్టా రైతాంగాన్ని దిక్కుతోచని స్థితిలోకి నెట్టేశాయి. 2003లో ఇలాంటి పరిస్థితి రావడంతో ప్రకాశం బ్యారేజి పైన రైతులు అతి పెద్ద ధర్నా నిర్వహించారు. అప్పటికి పులిచింతల నిర్మించలేదు. నిర్మించిన తరువాత కూడా కృష్ణా డెల్టాలో వరి పంట సాగు చేయవద్దనటం విచిత్రంగా వుంది.
కృష్ణా డెల్టా ప్రత్యేక పరిస్థితులు వరి వైపే రైతుల మొగ్గు ఎందుకు?
డెల్టా ప్రాంతంలో ప్రత్యామ్నాయ పంటలు వేయమని ప్రభుత్వం చెప్పడం కాగితం మీద సులువుగానే కనిపించినా, క్షేత్రస్థాయిలో ఉన్న భౌగోళిక పరిస్థితులు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. డెల్టా నేలలు ఎక్కువగా నల్లరేగడి, బంకమన్ను నేలలు. ఈ ప్రత్యేక స్వభావం వల్ల భూమి నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకుంటుంది. వరి పొలాల్లో నీరు నిల్వ వుండటం కోసం, పొలాలను గట్టులతో మడిగా ఏర్పాటు చేస్తారు. మడిలో నుండి మురుగు నీరు బయటకు పంపటానికి వీలుగా ఏర్పాటు జరుగుతుంది. డ్రెయినేజీ వ్యవస్థ నిర్వహణ లోపం కారణంగా, కాలక్రమేణా కాలువలు, డ్రెయిన్లు పూడిపోవడం వల్ల సరైన నీటి పారుదల వ్యవస్థ లేదు. చిన్న వర్షం పడినా లేదా చిన్నపాటి తుఫాను వచ్చినా మాగాణి పొలాల్లో నీరు నిలిచిపోతుంది. ప్రభుత్వం సూచించినట్లుగా ప్రత్యామ్నాయ పంటలు మొక్కజొన్న, మిరప, పత్తి, మినుము వంటి ఆరుతడి పంటలు వేసినప్పుడు పొలంలో నీరు నిలిస్తే, వేరుకు కుళ్ళు తెగులు వచ్చి పంట క్షణాల్లో నాశనమవుతుంది. అందుకే రైతులు నీటిని తట్టుకునే వరి పైనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తోంది.
ప్రభుత్వాల దగ్గరున్న అవకాశాలు - నీటి వినియోగం
ఎల్‌నినో ప్రభావం వల్ల తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొన్ని చోట్ల అసలు వర్షాలు పడవు. మరి కొన్ని చోట్ల కుండపోత వర్షాలు పడుతున్నాయి. కృష్ణానది పరీవాహక ప్రాంతం చాలా పెద్దది. ఇక్కడ కురిసిన వర్షపు నీటిని సద్వినియోగ పరచటంలోనే నిపుణుల నైపుణ్యం, పాలకుల సామర్థ్యం ఇమిడి వుంటుంది. డెల్టాను ఆదుకోవడానికి అందుబాటులో ఉన్న ఇతర వనరులను సమర్థవంతంగా నిర్వహించాలనేది రైతుల ప్రధాన డిమాండ్. పులిచింతల ప్రాజెక్టులో 45 టి.ఎమ్.సిల నీటిని నిల్వచేయొచ్చని ప్రభుత్వం చెప్తుంది. పులిచింతల నిర్మాణం చేసేది, కృష్ణా డెల్టాలోని పంటల రక్షణ కోసమన్నారు. అదే ఉద్దేశ్యంతో కృష్ణా డెల్టాలోని ప్రజలు, రైతు నాయకులు పులిచింతల కోసం పోరాడి సాధించుకున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో, పులిచింతల నీటిని కృష్ణా డెల్టా పంటల రక్షణకు వినియోగిస్తామని పులిచింతల నిర్మాణం సమయంలో ప్రభుత్వాధినేతలు సెలవిచ్చారు. ఇపుడు మాటమార్చి, తాగునీటికోసం పులిచింతల అంటున్నారు. తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. చెరువులు నింపాలి. మొట్టమొదట కట్టిన ప్రాజెక్టులకున్న రిపేరియన్ రైట్స్ ని ఉపయోగించుకోవాలి. పై నుండి ప్రవహించినపుడు, నదీతీర వాసులకు నీటిని వాడుకోవటానికి వున్న హక్కును ఉపయోగించుకోవాలి. పూర్తి నీటి సామర్థ్యం వరకు పులిచింతలలో నీటిని నింపి, అవసరమయినపుడు కృష్ణా డెల్టా పంటల రక్షణకు ఉపయోగించుకోవాలి. అవసరమైతే వారబందీ పద్ధతి ద్వారా లేక రేషన్ పద్ధతి ద్వారా నీటిని అందించవచ్చు. గోదావరి నీటిని సమర్థవంతంగా వినియోగించాలి. పట్టిసీమ ద్వారా గోదావరి నదిలో వరద నీరు ఉధృతంగా ఉన్నప్పుడు కృష్ణా డెల్టాకు నీటిని మళ్ళించి ప్రకాశం బ్యారేజీ ఆయకట్టను స్థిరీకరించవచ్చు.
క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక మార్గాలు
ప్రస్తుత సంక్షోభాన్ని తట్టుకోవడానికి, రైతులు పూర్తిగా నష్టపోకుండా ఉండటానికి సాంకేతిక, వ్యవసాయ నిపుణులు కొన్ని మార్గాలు సూచించారు. మొదటిది- వరి నేరుగా విత్తుటం. నారు పోసి, నీరు నిలబెట్టే సంప్రదాయ పద్ధతికి స్వస్తి చెప్పి, డ్రమ్ సీడర్ లేదా గొర్రుతో నేరుగా విత్తుకోవడం. దీనివల్ల 30 శాతం వరకు నీరు, పెట్టుబడి వ్యయం ఆదా అవుతాయి. రెండవది- స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకోవటం.110-120 రోజుల్లో చేతికి వచ్చే తక్కువ నీటితో పండే వరి రకాలను సాగు చేయడం. మూడవది - ఆరుతడి పంటలకు ఎత్తైన మడులు వేయటం. మురుగు నీటి సౌకర్యం సరిగా లేని మాగాణుల్లో ఆరుతడి పంటలు వేయాల్సి వస్తే, బోదెలు చేసి పంటలు వేయడం ద్వారా నీరు నిలవకుండా కాపాడుకోవచ్చు. నాల్గవది- సబ్సిడీ విత్తనాలు-బీమా అంశం. రిస్క్ అనే ఆలోచన ఉన్నప్పటికీ, నీటి లభ్యతపై అనిశ్చితి కొనసాగుతున్నా వరి నారును సిద్ధం చేస్తున్న రైతులను అభినందించాలి. ప్రోత్సహించాలి. అవసరమయిన అన్ని సహాయాలూ ప్రభుత్వం అందించాలి. భారీ రిస్క్ తీసుకుని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రీమియం కట్టి బీమా సౌకర్యాన్ని కలిగించాలి. రైతులకు ఆర్థికంగా ఆ మాత్రం సహాయాన్ని ప్రభుత్వం చేయాలి. రైతు సేవా కేంద్రాల ద్వారా డెల్టా భూములకు తగిన ఉచిత/సబ్సిడీ ప్రత్యామ్నాయ విత్తనాలను, సాంకేతిక సలహాలను ఉచితంగా అందించాలి. ఐదవది- దీర్ఘకాల ప్రణాళికగా, వరద నీటిని నిల్వ చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేయాలి. అవనిగడ్డ ప్రాంతంలో రెండు చెక్ డామ్ లు కట్టటం ద్వారా 6.75 టి.ఎమ్. సి ల నీటిని నిల్వచేయటానికి అనుమతులు, ప్రణాళికలు సిద్ధంగా వున్నా ఆచరణకు నోచుకోలేదు. పాలేరు, మున్నేరు పై రిజర్వాయర్ల ద్వారా 5 టి.ఎమ్. సి ల నీటిని నిల్వచేయొచ్చని నిపుణులు సూచించినా ఆచరించలేదు.
పులిచింతల నీటిని కృష్ణా డెల్టా పంటల రక్షణకు వినియోగించాలి. మురుగు నీటి పారుదల వ్యవస్థలో లోపాలు ఉన్నాయని తెలిసి పంట వద్దనడం కంటే, తక్షణ కాలువల పూడికతీత, తక్కువ నీటితో పండే నూతన సాగు పద్ధతులను ప్రోత్సహించడమే సరైన పరిష్కారం. గోదావరి-కృష్ణా జలాలను సక్రమంగా వినియోగించాలి. కృష్ణా డెల్టా రైతుకు సాగునీరు అనేది కేవలం వరి పంట వేయాలా వద్దా అనే ప్రశ్న మాత్రమే కాదు. అది రైతులను ఆదుకునే విధానం. ప్రభుత్వం, రైతాంగం, రైతు సంఘాలు కలిసికట్టుగా అడుగులు వేసినప్పుడే డెల్టాలో ఈ నీటి సంక్షోభాన్ని అధిగమించవచ్చు.
- వ్యాసకర్త : డా. కొల్లా రాజమోహన్
నల్లమడ రైతు సంఘం నేత







కామెంట్‌లు (0)