శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కోతుల బెడద...

07 నవంబర్, 2026

కోతుల బెడద image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 05:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మాంచాల అడవిలో కోతులతోపాటు అనేక జంతువులు, పక్షులు నివసిస్తుండేవి. అడవికి సమీపంలో ఉన్న గ్రామంలోని కట్టెల వ్యాపారులు అడవిలో ఉన్న చెట్లను నరికి కలపను అమ్ముకునేవారు. ఇలా కొంతకాలం గడిచేసరికి అడవి అంతా పల్చబడింది. దీంతో చాలా వరకు పక్షులు, జంతువులు వేరే చోటికి వలస వెళ్లాయి. కోతులు మాత్రం కట్టెల వ్యాపారుల ఊరు మీద పడి ప్రజలను ఇబ్బంది పెట్టాలని తీర్మానించుకున్నాయి. కోతుల దండయాత్రతో గ్రామంలో ఉన్న చెట్ల పండ్లు, ఇండ్లలోని సామాగ్రి చిందరవందర అయ్యేది. పదే పదే కోతులు ఆ గ్రామానికి రావడం, ప్రజలు ఇబ్బందులు పడడం పరిపాటి అయ్యింది. ఆ ఊరి బడిలో 9వ తరగతి చదివే రాహుల్ కోతుల బెడద ఎలాగైనా తగ్గించాలనుకున్నాడు. ఒక రోజు తన స్నేహితులతో కలిసి అడవికి వెళ్లాడు. పిల్లలందరూ అడవిలోని చెట్లన్నీ నరికి వేయడం చూశారు. ఆహారం లేక కోతులతో సహా జంతువులన్నీ ఇబ్బంది పడడం గమనించారు. గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులకు, గ్రామ ప్రజలకు విషయం చెప్పారు. గ్రామస్తులందరూ అడవిలో చెట్లు నరకకుండా కట్టెల వ్యాపారులను హెచ్చరించారు. అంతేకాకుండా కొత్త చెట్లు పెరిగేలా అడవిలో రకరకాల గింజలను చల్లారు. కొంతకాలానికి అవి మొలకెత్తి చెట్లుగా పెరిగాయి. అడవి మళ్ళీ పచ్చదనంతో నిండిపోయింది. వలస వెళ్లిన జంతువులు, పక్షులు కూడా మళ్లీ అడవికి వచ్చాయి. మంచి ఆలోచనతో కోతుల బెడద తప్పే విధంగా ప్రయత్నించిన రాహుల్ ను వారి ఫ్రెండ్స్ ను గ్రామస్తులందరూ అభినందించారు.

- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి,

94415 61655.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్