ఒక అడవిలో ఒక నెమలి ఉండేది. తన పింఛం విప్పి నాట్యం చేస్తుంటే అడవిలోని జంతువులన్నీ ఆశ్చర్యంగా చూసేవి. నెమలిని పొగిడేవి. నెమలికి తన అందం మీద చాలా గర్వం ఉండేది. తనలాంటి అందమైన పక్షి ఈ అడవిలో లేదని అనుకునేది. అదే అడవిలో కోకిల కూడా నివసించేది. వసంతకాలం రాగానే, అడవిలో ఎక్కడ చూసినా కోకిల గురించే చర్చ. "కోకిల పాట ఎంత మధురంగా ఉందో!", "వసంతానికి కోకిలే కదా అందం!" అని అందరూ మెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఇది చూసి నెమలికి అసూయ కలిగింది. అది ఒకరోజు కోకిల దగ్గరకు వెళ్లి, "చూడడానికి నల్లగా, చిన్నగా ఉన్నావు. నా దగ్గర ఉన్న రంగులు, పింఛం నీకు లేవు. అయినా అందరూ నిన్నే ఎందుకు పొగుడుతున్నారో నాకు అర్థం కావడం లేదు!" అని అంది. కోకిల ఏమీ మాట్లాడకుండా చిరునవ్వు నవ్వి ఎగిరిపోయింది. కొద్దిసేపటికి అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు. అతను పక్షుల కోసం వెతుకుతుండగా, నెమలి తన భారీ పింఛంతో పొదల్లో దాక్కున్నా స్పష్టంగా కనిపించేసింది. వేటగాడు నెమలిని పట్టుకోవాలని అడుగులు వేశాడు. సరిగ్గా అప్పుడే దూరంగా ఉన్న చెట్టు మీద నుండి కోకిల ఒక్కసారిగా గట్టిగా, హెచ్చరిస్తున్నట్లుగా కూసింది. ఆ శబ్దాన్ని విన్న నెమలి అప్రమత్తమై వెంటనే అక్కడి నుండి సురక్షిత ప్రాంతానికి తప్పించుకుంది.
వేటగాడు వెళ్లిపోయాక, నెమలికి ఒక విషయం అర్థమైంది. బాహ్య రూపం కేవలం కంటికి మాత్రమే కనిపిస్తుంది, అది ఎప్పుడూ రక్షణ ఇవ్వదు. అంతర్గత ప్రతిభ కోకిల కంఠంలా ఇతరుల మనసులను గెలవడమే కాకుండా, తన గొంతుతో ఇతరులను అప్రమత్తం చేయగలదు. నెమలి మెల్లగా కోకిల దగ్గరకు వెళ్లి, "క్షమించు మిత్రమా! అందం అంటే రంగుల్లో లేదు, మనం ఇతరులకు పంచే ఆనందంలో ఉందని ఈరోజు నాకు అర్థమైంది," అని ఒప్పేసుకుంది. "రూపం కంటే గుణం గొప్పది. ఆకర్షణ కొద్దిసేపే ఉంటుంది, కానీ మంచి పని లేదా మాట ఎప్పటికీ నిలిచిపోతుంది" అని అర్థం చేసుకున్న నెమలి తన గర్వాన్ని విడిచి అందరితో స్నేహంగా మెలుగుతూ ఆనందంగా అడవిలో జీవించింది.
- మొర్రి గోపి
కవిటి, శ్రీకాకుళం జిల్లా
88978 82202.








కామెంట్‌లు (0)