మా స్కూల్లో విద్యార్థుల సృజనాత్మకతకు పీఠం వేస్తూ పాఠశాలలో నిర్వహించిన 'నో బ్యాగ్ డే' అత్యంత కోలాహలంగా సాగింది. పుస్తకాల మోత లేకపోవడంతో విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంగా, స్వేచ్ఛగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం విరామ సమయంలో పిల్లలు స్వయంగా తయారు చేసిన రుచికరమైన తినుబండారాలను తమ ఉపాధ్యాయులకు ప్రేమతో అందించి, మధ్యాహ్నం రకరకాల వంటకాలను తోటి మిత్రులతో పంచుకుంటూ సంతోషంగా భోజనం చేశారు. ఆ తర్వాత పిల్లలు చేసిన ఆకర్షణీయమైన నృత్యాలు, ప్రదర్శించిన లలిత కళలు అందరినీ అలరించాయి. వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించేలా నాట్యం చేశారు. ఆసక్తికరమైన సినిమా చూడటం, పచ్చని ప్రకృతి పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం ద్వారా విద్యార్థులు ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నారు.
ఈ ప్రత్యేక రోజున విద్యార్థులు తమలోని మేధో సంపత్తికి, హస్తకళలకు పదునుపెట్టారు. మ్యాప్ ఆధారిత ఆటలు ఆడారు.'మాట్లాడే ఉత్తరం' వంటి సరదా భాషా క్రీడల్లో పాల్గొనడం ద్వారా కొత్త ఆలోచనా విధానాన్ని పెంపొందించుకున్నారు. అంతేకాకుండా, స్వయంగా బొమ్మలు తయారు చేయడం, వర్ణరంజితమైన చిత్రలేఖనాలు వేయడం ద్వారా తమలోని దాగి ఉన్న సృజనాత్మకతను ప్రతిభావంతంగా ప్రదర్శించారు. తరగతి గది నాలుగు గోడలకే పరిమితం కాకుండా, ఆటపాటలు, ప్రకృతి వీక్షణ, మరియు సృజనాత్మక కళల సమాహారంగా సాగిన ఈ 'నో బ్యాగ్ డే' విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను, తోటివారితో కలిసి పనిచేసే సహకారాన్ని పెంపొందించి వారికి ఎప్పటికీ గుర్తుండిపోయే మధురానుభూతిని అందించింది.
యస్.శ్రీ హాసిక,
ఎనిమిదవ తరగతి, అరవింద హై స్కూల్,
కుంచనపల్లి, గుంటూరు జిల్లా.








కామెంట్‌లు (0)